సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ (కోవిడ్-19) భయంతో జనాలు హడలిపోతున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అందరూ హ్యాండ్ శానిటైజర్లు, మాస్క్‌ల మీద పడ్డారు. దీంతో ఆ రెండింటి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఒక్కొక్కరూ అయిదారు శానిటైజర్లు కొనడంతో చాలా దుకాణాల్లో స్టాక్ అయిపోయిందని దుకాణదారులు చెబుతున్నారు. జనాలు విపరీతంగా శానిటైజర్లు, ఫేస్ మాస్క్‌లు కొంటున్నారని, దీంతో తాము భారీ ఎత్తున వాటి కోసం కంపెనీలకు ఆర్డర్లు పెడుతున్నామని దుకాణదారులు చెబుతున్నారు.
(చదవండి : కరోనా ఎఫెక్ట్ : మార్చి 30 వరకు సెలవులు)
హ్యాండ్ శానిటైజర్లు,ఫేస్ మాస్క్ అందుబాటులో లేకపోవడం.. ఉన్నా ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. కొంతమంది అయితే ఇంట్లోనే హ్యాండ్ శానిటైజర్ల తయారు చేసుకుంటున్నారు. ఇక దీని కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ‘హ్యాండ్ శానిటైజర్లు తయారు చేసుకోవడం ఎలా’ అనేది గూగుల్‌లో సెర్చ్‌చేసి తెలుసుకుంటున్నారు. గూగుల్ ట్రెండ్స్, అలస్కా ప్రకారం.. ఇంట్లోనే శానిటైజర్ల తయారి కోసం గూగుల్‌లో సెర్చ్ తెలుసుకున్న వారిలో అమెరికా వాసులు అత్యధికంగా ఉన్నారు. అమెరికాలోని వెర్మోంట్, రోడ్ ఐలాండ్ ప్రాంతాలలో దీని గురించి ఎక్కువగా శోధించారు. ఆ తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)లోని వేల్స్‌లో అత్యధిక మంది ‘ ఇంట్లో హ్యాండ్ శానిటైజర్లు తయారు చేసుకోవడం ఎలా’ అనేదానిని సెర్చ్ చేసి తెలుసుకున్నారు.
మరోవైపు.. చైనాలో కోవిడ్ వైరస్ వ్యాపించినప్పటి నుంచి మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్లు సరఫరా తగ్గిపోయింది. సాధారణ రోజుల్లో గుడ్డ మాస్క్‌లు చౌకగా దొరికేవి. అయితే ఇప్పుడు వాటి ధర కూడా అమాంతం పెరిగిపోయాయి. రూ.20, రూ.30 ఇచ్చి మరి కొనాల్సి వస్తుందని జనాలు వాపోతున్నారు. హ్యాండ్ శానిటైజర్లు రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. ఇక యూకేలో అయితే హ్యాండ్ శానిటైజర్లు రేట్లు 255శాతం పెరిగిపోయాయి. దీంతో ప్రజలు ఇంట్లోనే హ్యాండ్ శానిటైజర్లు తయారుచేసుకునే పనిలో పడ్డారు. కానీ ఇంట్లో తయారు చేసుకునే హ్యాండ్ శానిటైజర్లతో కరోనాను దూరం పెట్టడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. అవి పనిచేయకపోవడమే కాకుండా.. చర్మాన్ని కూడా దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు. హ్యాండ్ శానిటైజర్ల కంటే సబ్బుతో చేతులను కడుక్కోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment