‘పెళ్లంటే నూరేళ్ల పంట’ అని ఒకరు ‘మంట’ అని మరొకరు వారి వారి అనుభవాల మేరకు ఎలాగైనా చెప్పుకోవచ్చు. వధూవరులకు మాత్రం అవి ఎప్పటికి అమృత ఘడియలే. అంగరంగ వైభవంగా కాకపోయినా బంధుమిత్రుల మధ్య అనందంగా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు వధూవరులు ఎవరైనా. ఇక సోషల్ మీడియా రాజ్యమేలుతున్న నేటి రోజుల్లో బంధు మిత్రులను ఆహ్వానించడం పెద్ద కష్టమేమి కాదు. అమెరికాకు చెందిన ఓ వధువు ‘దట్స్ ఇట్ ఐయామ్ వెడ్డింగ్ షేమింగ్’ అనే ఫేస్‌బుక్ గ్రూపునకు రెండు పేజీల ఆహ్వాన పత్రాన్ని పంపించింది.
అందులో వడ్డించే ఆహారంకన్నా షరతులే ఎక్కువగా ఉన్నాయి. తాను స్వర్ణ వన్నె అంచు కలిగిన లేత గులాబీ రంగు పెళ్లి గౌనును ధరిస్తానని, అతిథులెవరు కూడా షాంపెయిన్ లేదా లేదా గులాబీ రంగు దుస్తులు వేసుకొకి రాకూడదని షరతు పెట్టారు. రెండు రకాల పాలతోపాటు నాలుగు రకాల కుకీలను మాత్రమే పెళ్లి విందులో సర్వ్ చేస్తాం. అది కూడా పెద్ద స్థాయిలో కాదు, కనుక భోంచేయాలనుకునే వారు ముందుగానే శుభ్రంగా భోంచేసి రావచ్చని చెప్పారు. ముఖ్యంగా పెళ్లి బుధవారం జరుగుతున్నందున పెళ్లికి ఎక్కువ మంది రాకపోవచ్చని, అలా రాలేకపోయిన వారు ఎంత మాత్రం చింతించరాదని, వారి కోసం తన పెళ్లిని ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షంగా ప్రసారం చేస్తున్నామని చెప్పారు. ఏడాది క్రితమే పెళ్లి నిశ్చయమైన పెళ్లవడానికి ఇంతకాలం నిరీక్షించాల్సి వచ్చిందని అన్నారు. ఎంతో కష్టపడితే అది ఓ స్నేహితురాలి సహకారం వల్ల పెళ్లి వేదిక ఖరారయిందని తెలిపారు.
జింజర్ స్నాప్, చాకొలెట్ చిప్, ఓట్‌మీల్ రైజిన్, పీనట్ బటర్ కుకీలను విందులో సరఫరా చేస్తామని చెప్పారు. అల్మండ్ మిల్క్‌తోపాటు ఆ రోజు అందుబాటులో ఉండే మరో మిల్క్‌ను కూడా సరఫరా చేస్తామని, కుకీలు తియ్యగా ఉంటాయి కనుక అల్మండ్ మిల్క్‌లో తీపిలోని వెనీలా ఉంటుంది వివరించారు. ఇక వధూవరులు, చుట్టూ మూగే పిల్లల కోసం కప్ కేక్స్, రెగ్యులర్ వెడ్డింగ్ కేక్‌లు ఉంటాయని తెలిపారు. ఆహ్వానం అందుకోని వారు ఎంత మాత్రం పెళ్లికి రావద్దని కూడా వధువు షరతు పెట్టారు. అలా వచ్చినట్లయితే వారిని నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపిస్తామని కూడా హెచ్చరించారు. ఆర్‌ఎస్‌వీపీ (సాధ్యమైనంత త్వరగా స్పందించడం) మెయిళ్లకు స్పందించని వారు, రిసెప్షన్ వరకు నిరీక్షించకుండా వెళ్లి పోవాలని కూడా సూచించారు. ఆర్‌ఎస్‌వీపీ మెయిళ్లకు ఎంత మంది స్పందిస్తే అంత మందికి మాత్రమే రిసెప్షన్‌లో కుర్చీలు ఉంటాయని, వారిని మాత్రమే అనుమతించి మిగతా వారిని వెనక్కి పంపిస్తామని కూడా ఆమె షరతు పెట్టారు. షోకేసులో పెట్టుకోవడానికే కాకుండా సంసారానికి ఉపయోగపడే బహుమతులు మాత్రమే పెళ్లికి తీసుకరావాలని ఆమె సూచించారు. తమ ‘హనీమూన్’ కోసం ‘హనీ’ పేరిట ఓ బ్యాంక్ ఖాతాను కూడా తెరిచామని, దానికి డబ్బులు పంపిస్తే బాగుంటుందని కూడా సూచించారు. ఇంత పెద్దగా ఆహ్వాన పత్రికను రాస్తున్నందుకు తనను క్షమించాలని కూడా ఆమె కోరారు.
ఇన్ని వివరాలు, ఇంత విఫులంగా వివరించిన ఆమె ఇంతకు తన పెళ్లి ఏ బుధవారమో, ఎక్కడో, ఎవరిని చేసుకోబోతున్నారో తెలియజేయలేదు. ఆఖరికి తన పేరును కూడా పేర్కొనలేదు. ఏదేతైనేమీ ఆమె అమెరికాకు చెందిన రాచెల్ రవియోలిగా ఫేస్‌బుక్ యూజర్లు గుర్తించారు. ఆమె పెళ్లి ఎప్పుడో, ఎక్కడో కూడా కనుక్కుంటామని సవాల్ చేశారు. పైగా ఆమె ఈ విధంగా ఆహ్వానించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా ఆమె బాగా మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు ఆందోళన కూడా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment