ఐఎస్‌ఐ కనుసన్నల్లోనే లష్కరే పనితీరు | CTD arrests ‘terrorists’ affiliated with AQIS and Lashkar-e-Jhangvi | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఐ కనుసన్నల్లోనే లష్కరే పనితీరు

Published Fri, Jan 22 2016 4:02 AM | Last Updated on Sat, Mar 23 2019 7:58 PM

ఐఎస్‌ఐ కనుసన్నల్లోనే లష్కరే పనితీరు - Sakshi

ఐఎస్‌ఐ కనుసన్నల్లోనే లష్కరే పనితీరు

* పాక్ ఆర్మీతో కలిసి ఉగ్ర సంస్థల ఏర్పాటు
* ఐసిస్ కమాండర్ హఫీజ్ సయీద్ ఖాన్ వెల్లడి
* కశ్మీర్‌లో ఐసిస్ విస్తరణ.. ఖలీఫాపై త్వరలోనే శుభవార్త

వాషింగ్టన్: భారత్‌లో విధ్వంసమే లక్ష్యంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాతోపాటు పలు ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ, ఆ దేశ ఆర్మీ పూర్తిగా సహకారం అందిస్తున్నాయని మరోసారి వెల్లడైంది. కశ్మీర్‌లో దాడులు, భారత్‌లో అనిశ్చితి సృష్టించేందుకే.. పాక్ ఆర్మీతో కలసి ఐఎస్‌ఐ ఈ ఉగ్ర సంస్థలను సృష్టించిందని ఐసిస్ ఆన్‌లైన్ మేగజైన్ ‘దబిక్’ తెలిపింది. పాకిస్తాన్, అఫ్గాస్తాన్‌ల ఐసిస్ బాధ్యతను చూస్తున్న హఫీజ్ సయీద్ ఖాన్ అనే ఉగ్రనేత ‘దబిక్’కు  ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించారు.

‘పాకిస్తాన్‌లో దుష్టశక్తులు.. మరీ ముఖ్యంగా ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్‌ఐ, ఆర్మీ.. తమ వ్యక్తిగత అవసరాలకోసం ఏ విధంగా ఉగ్రసంస్థలను సృష్టించి కశ్మీర్‌లో విధ్వంసాలకు పాల్పడిందో మనకు తెలుసు’ అని అన్నారు.  ‘అల్లాకోసం, ముస్లింలకోసం కాకుండా.. వారి వ్యక్తిగత ఆసక్తుల కోసం కశ్మీర్ యువతను రెచ్చగొట్టార’ని విమర్శించారు. ఐఎస్‌ఐ చెప్పినట్లు వింటున్నందుకే.. కశ్మీర్‌లోని ఏ ప్రాంతంపైనా లష్కరే తోయిబాకు ఇంకా పట్టుచిక్కలేదన్నారు.

‘అధీనంలో ఉన్న పాకిస్తాన్‌లోనే అల్లా చట్టాన్ని అమలుచేయలేని వారు.. కశ్మీర్‌లో ఏ విధంగా అల్లా రాజ్యాన్ని ఏర్పాటు చేస్తార’ని ప్రశ్నించారు. తమను ఎవరు కాపాడతారా అని కశ్మీర్ ప్రజలు ఎదురుచూస్తుంటే.. పాకిస్తాన్ తన స్వలాభం కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందుకే కశ్మీర్‌లోని వివిధ ఉగ్రసంస్థల కార్యకర్తలు ఐసిస్‌లో చేరుతున్నారని..దీనివల్ల లోయలో ఐసిస్ విస్తరణకు మంచి అవకాశం ఉందన్నారు.

ఈ ప్రాంతాల్లో ఖలీఫా రాజ్య స్థాపన గురించి ముస్లింలు త్వరలోనే ఓ శుభవార్త వింటారని సయీద్ తెలిపారు. అఫ్గానిస్తాన్  తాలిబాన్ చీఫ్ ముల్లా అఖ్తర్ మన్సూర్, అతని సహచరులకు కూడా ఐఎస్‌ఐతో సత్సంబంధాలున్నాయని సయీద్ తెలిపారు. ఇస్లామాబాద్, పెషావర్, క్వెట్టా వంటి ప్రాంతాల్లో అఫ్గాన్ తాలిబాన్ నేతలు స్వేచ్ఛగా తిరుగుతారని.. వారికి అక్కడ నివాసాలు కూడా ఉన్నాయని వెల్లడించారు.

మన్సూర్ సలహా మండలిలోనూ ఐఎస్‌ఐ అధికారులు సభ్యులుగా ఉన్నారని సయీద్ తెలిపారు. కొన్ని నెలల క్రితం తాలిబాన్ నాయకుడు హమీద్ గుల్ చనిపోయినపుడే ఈ విషయం బయటపడిందన్నారు. ఐఎస్‌ఐ.. తను సృష్టించిన ఉగ్రవాద సంస్థలను సమన్వయం చేసేందుకు రిటైర్డ్ జనరల్ అయిన హమీద్‌ను నియమించిందన్నారు. 2014 అక్టోబర్‌లో తాలిబాన్ సంస్థకు కు గుడ్‌బై చెప్పిన హఫీజ్ సయీద్ ఖాన్ మరో ఐదుగురు కమాండర్లతో కలిసి ఐసిస్‌లో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement