వాషింగ్టన్: జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని అమెరికా పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపిన సంగతి తెలిసిందే. అతని మరణంతో అమెరికా అట్టుడికిపోతోంది. అమెరికాలో నల్లజాతీయులపై దాడులకు నిరసనగా ఆందోళనకారులు వీధుల్లోకి వస్తూ నిరసనలు చేపడుతున్నారు. ముఖ్యంగా జార్జ్ మరణం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కుంగదీసింది. జార్జ్ పంచప్రాణాలైన అతని ఆరేళ్ల కుమార్తె జియాన తండ్రి లేని బిడ్డగా మారింది. తాజాగా వీరిద్దరి ఆప్యాయత, ప్రేమానురాగాలకు ప్రతీకగా ఉన్న ఓ వీడియోను మాజీ ఎన్‌బీఏ ఆటగాడు, జార్జి ఆప్త స్నేహితుడు స్టీఫెన్ జాక్సన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ఆ చిన్నారి తండ్రి భుజాలపై కూర్చుని "డాడీ చేంజ్‌డ్ ద వరల్డ్" (నాన్న ప్రపంచాన్నే మార్చివేశాడు) అంటూ కిలకిల నవ్వుతూ చెప్తోంది. (అమెరికాలో ఆందోళనలు; ఒబామా స్పందన)
'నిజంగానే డాడీ లోకాన్ని మార్చేశాడం'టూ స్టీఫెన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. 'ఇది చూస్తుంటే సంతోషం, కన్నీళ్లు ఒకేసారి తన్నుకొస్తున్నాయి' అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు. కాగా మే 25న మిన్నెసొటాలో ఓ పోలీసు.. జార్జ్ ఫ్లాయిడ్ వేడుకుంటున్నా వినకుండా అతని మెడపై ఎనిమిది నిమిషాలకుపైగా మోకాలితో నులుముతూ అత్యంత దారుణంగా చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రజాగ్రహం పెల్లుబికడంతో శుక్రవారం సదరు పోలీసును అధికారులు అరెస్ట్ చేశారు. (నలుగురు పోలీసులకు శిక్ష పడాలి: జార్జ్ భార్య)
Comments
Please login to add a commentAdd a comment