బెర్లిన్ : అప్పు చెల్లించకపోతే ఆస్తులను వేలం వేస్తారని తెలుసు కదా. ఇదే పద్దతిని ఫాలో అయ్యాడు ఓ పన్ను వసూలు అధికారి. అయితే ఇక్కడ అతడు వేలం వేసింది భూముల్ని, విలువైన ఆస్తుల్ని కాదు.. కుక్కను. అవును పెంపుడు కుక్కను వేలం వేసి వచ్చిన సొమ్మును పన్ను బకాయి కింద జమ చేసుకున్నాడు. ఈ విచిత్ర సంఘటన జర్మనీలో చోటు చేసుకుంది. అయితే బాధిత కుటుంబం గురించి పూర్తి వివరాలు తెలియలేదు. పన్ను బకాయి పడ్డ సదరు యజమాని గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విధులకు కూడా హాజరు కాలేదట. ఈ క్రమంలో అతడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్‌ను సకాలంలో కట్టలేకపోయాడు. కుక్క పన్నుతో సహా పలు ఇతర పన్నులు బకాయిపడ్డాడు.
ఈ నేపథ్యంలో పన్ను వసూలు అధికారి ఆ కుటుంబానికి చెందిన పలు విలువైన ఆస్తులతో పాటు వారికి బహుమతిగా లభించిన పెంపుడు కుక్కను కూడా వేలం వేశాడు. ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన కుక్క కాస్తా దాదాపు రూ. 60 వేలకు అమ్ముడయ్యింది. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. సదరు అధికారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు. ‘బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం తగదు.. అతడు నిబంధనలను అతిక్రమించి మూగ జీవి పట్ల క్రూరంగా వ్యవహరించాడు. అతని మీద చర్యలు తీసుకోవాల’ని డిమాండ్ చేస్తున్నారు. పన్ను వసూలు కోసం కుక్కను అమ్మాడంటే.. మనుషుల్ని కూడా అమ్ముతాడనడంలో సందేహం లేదని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
Comments
Please login to add a commentAdd a comment