బాగా.. డీ..ఈఈ..ప్‌గా ఈదండి! | deepest swimming pool located in Montegrotto Terme, Padua, Italy | Sakshi
Sakshi News home page

బాగా.. డీ..ఈఈ..ప్‌గా ఈదండి!

Published Fri, Aug 12 2016 1:57 AM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

బాగా.. డీ..ఈఈ..ప్‌గా ఈదండి!

బాగా.. డీ..ఈఈ..ప్‌గా ఈదండి!

ఈ స్విమ్మింగ్‌పూల్ చాలా లోతు గురూ..!
ఈత.. కొందరికి ఎక్సర్‌సైజ్.. ఇంకొందరికి అడ్వెంచర్! మీరు రెండో కేటగిరీకి చెందిన వారైతే ఈ వార్త మీ కోసమే. ఫొటోలో కనిపిస్తున్నదే.. దీని పేరు ‘వై 40 ది డీప్ జాయ్’. ఇటలీలోని మోంటేగ్రొట్టోలో ఉండే హోటల్ మిలిపినీ టెర్మేలో ఉంటుంది ఇది. ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్‌గా దీనికి పేరుంది. ఎంత లోతు అంటారా? పేరులో ఉందిగా.. 40 అని అన్ని మీటర్లు! అడుగుల్లో చెప్పుకోవాలంటే దాదాపు 132 అడుగులన్నమాట! పై నుంచి చూస్తే సాధారణ స్విమ్మింగ్ పూల్ మాదిరిగా కనిపించినా.. లోతుకు వెళ్లే కొద్దీ దీంట్లోని అందాలు అటు థ్రిల్.. ఇటు ఆనందాన్ని ఇస్తాయి. ముందుగా చెప్పుకోవాల్సింది డైవ్ కొట్టడం గురించి. వై 40లో ఏకంగా 36 అడుగుల ఎత్తు నుంచి డైవ్ కొట్టే సౌకర్యముంది.

అంతేకాకుండా స్కూబా డైవింగ్, స్నోర్కెలింగ్‌లను కూడా అనుభవించేందుకు దీంట్లో మూడు గుహల్లాంటి ఏర్పాట్లూ ఉన్నాయి. అన్నీ బాగున్నాయి కానీ నాకు ఈత రాదే.. అంటున్నారా? నో ప్రాబ్లెమ్. మీలాంటి వారి కోసం ఇందులో ఓ సొరంగం లాంటి నిర్మాణముంది. పూర్తిగా పారదర్శకమైన గాజుతో కట్టిన ఈ సొరంగంలోకి నడిస్తే వై 40లో జరుగుతున్న అన్ని రకాల కార్యకలాపాలను చూసేయవచ్చు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ స్విమ్మింగ్ పూల్‌లో ఎప్పుడైనా దాదాపు 43 లక్షల లీటర్ల నీళ్లు ఉంటాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ నీళ్లు క్లోరిన్ కంపు కొట్టవు. అంత లోతులో నీళ్లు మరీ చల్లగా ఉంటాయి అనుకోవద్దు. వై 40లో నీటి ఉష్ణోగ్రత రోజంతా 34 సెల్సియస్. డిగ్రీలు అంటే బయట వణికించే చలి ఉన్నా.. లోపల మాత్రం వెచ్చగానే ఉంటుందన్నమాట!


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement