
హావభావాలు మార్చే డిజిటల్ మోనాలిసా
లండన్: మోనాలిసా నవ్వు వెనక మర్మమేంటో నేటికీ తెలియదు. దీని వెనక రసహ్యమేంటో తెలియక ఇప్పటికీ పరిశోధకులు జుట్టు పీక్కుంటున్నారు. అలాంటిది మోనాలిసా చిత్రం చూసే ఒక్కొక్కరికీ ఒక్కోలా కనిపిస్తే ఇంకెలా ఉంటుంది? ఆ ఆలోచనకు ప్రతిరూపమే ‘లివింగ్ మోనాలిసా’ డిజిటల్ చిత్రం. 40 మంది ఫ్రెంచ్ కళాకారులు, టెక్నీషియన్లు ఏడాదిపాటు కష్టపడి దీన్ని తయారుచేశారు. వీడియోగేముల్లో ఉపయోగించే మోషన్ సెన్సింగ్ డివైజ్ టెక్నాలజీని ఇందుకోసం వినియోగించారు.
సందర్శకుల కదలికలు, ఆలోచనలను బట్టి ఈ చిత్రం కనిపించే విధానం మారుతూ ఉండటం దీని ప్రత్యేకత. ప్రపంచానికి మోనాలిసాను కొత్తగా చూపించాలన్న ఆలోచనే ఈ ఆవిష్కరణకు దోహదం చేసిందని ఈ బృందంలో కీలకపాత్ర పోషించిన ఫ్లోరెంట్ తెలిపారు. తన పరిసరాల్లో జరుగుతున్న మార్పులను ఇప్పుడు మోనాలిసా గుర్తించగలదని వెల్లడించారు. ‘‘మోనాలిసా చిత్రానికి డావెన్సీ తన కళతో ప్రాణం పోస్తే.. నేడు మేం టెక్నాలజీతో జీవం ఇచ్చాం’’ అని ఆయన అన్నారు. త్వరలో డిజిటల్ చిత్రం మార్కెట్లోకి అందుబాటులో రానుంది.