ట్రంప్ వల్ల భారత్-పాక్ సంబంధాలకు చేటు?
ట్రంప్ వల్ల భారత్-పాక్ సంబంధాలకు చేటు?
Published Sat, Dec 3 2016 12:54 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయడం వల్ల భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందట. ఈ విషయాన్ని అమెరికన్ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. విదేశీ నేతలకు ఫోన్లు చేసేముందు కొన్ని దశాబ్దాలుగా ఉన్న దౌత్య సంప్రదాయాలను చెడగొట్టేలా ఉండకూడదని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన కథనంలో పేర్కొంది. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. పాక్ ప్రధానికి ఫోన్ చేయడం, ఆ దేశ సమస్యల పరిష్కారానికి కావల్సిన ఏ పాత్రనైనా తాను పోషిస్తానని చెప్పడం వల్ల భారత్ - పాక్ సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఉందని చెప్పింది. చైనాతో ఉన్న సంబంధాలు కూడా దెబ్బతినేలా తైవాన్ అధ్యక్షుడు త్సాయ్ ఇంగ్ వెన్‌తో ట్రంప్ మాట్లాడటంతో చైనా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 1979 తర్వాత.. అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి లేదా అధ్యక్షుడు తైవాన్ నాయకులతో మాట్లాడటం ఇదే తొలిసారి.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అద్భుతమైన మనుషులతో కూడిన అద్భుతమైన దేశానికి తాను తప్పకుండా వస్తానని నవాజ్ షరీఫ్‌తో ట్రంప్ అన్నట్లు కథనాలు వచ్చాయి. పాకిస్థానీలు ప్రపంచంలోనే తెలివైన ప్రజల్లో ఒకరని కూడా ట్రంప్ అన్నట్లు తెలిసింది. అసలే పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని మండిపడుతున్న భారత దేశానికి ట్రంప్ చర్యలు పుండు మీద కారం చల్లినట్లుంటాయని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.
Advertisement