
వాషింగ్టన్ : కలహాలతో నిత్యం కీచులాడుకునే ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ప్రతిపాదిత చర్చలు తన ఘనతేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకున్నారు. ఉత్తర కొరియా దూకుడుకు తాను ఎప్పటికప్పుడు చెక్ పెట్టడం, కఠిన విధానాన్ని కొనసాగించడం వల్లే ఇది సాధ్యమైందని తనకు తాను కితాబిచ్చుకున్నారు. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా తాను నిబద్ధతతో వ్యవహరించని పక్షంలో ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య చర్చల ఊసే ఉండేది కాదంటూ ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతాయనే వార్తల నేపథ్యంలో ట్రంప్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
దక్షిణ కొరియాతో చర్చలకు తాను సిద్ధమేనని ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ తన నూతన సంవత్సర సందేశంలో పేర్కొన్నారు. వింటర్ ఒలింపిక్స్ నేపథ్యంలో వచ్చేవారం ఉత్తర కొరియాతో ముఖాముఖి చర్చలకు దక్షిణ కొరియా ప్రతిపాదించింది. ట్రంప్, కిమ్ అణు సవాళ్ల నేపథ్యంలో తాజా చర్చల పట్ల సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతోంది.
న్యూక్లియర్ బటన్ తన టేబుల్ వద్దే ఉందని ఇటీవల ఉత్తర కొరియా అధ్యక్షుడి హెచ్చరికకు ట్రంప్ దీటుగా బదులిస్తూ తన వద్దా న్యూక్లియర్ బటన్ ఉందని, అవి సమర్ధంగా పనిచేస్తాయంటూ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment