
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నారని ఆయనకు ఎలాంటి మానసిక సమస్యలు లేవని వైద్యులు స్పష్టం చేశారు. అధ్యక్ష పదవి చేపట్టాక తొలిసారిగా ట్రంప్‌కు నిర్వహించిన వైద్య పరీక్షల వివరాలను వెల్లడించారు. ‘వైద్య పరీక్షల ఫలితాలు విశ్లేషస్తే ట్రంప్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. అధ్యక్ష పదవిలో కొనసాగినంత వరకూ ఇలాగే ఉంటార’ని డాక్టర్ రానీ జాక్సన్ చెప్పారు.
71 సంవత్సరాల ట్రంప్‌కు భగవంతుడు అద్భుతమైన జీన్స్‌ను ప్రసాదించాడని చెప్పుకొచ్చారు. ట్రంప్ ఇటీవల తన మానసిక ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతూ కాగ్నిటివ్ టెస్ట్ నిర్వహించాలని తనను కోరారని..అయితే ఆయనకు ఎలాంటి మానసిక సమస్యలూ లేవని ఈ పరీక్షలో తేలిందని జాక్సన్ తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు ఈ తరహా పరీక్షకు వెళ్లడం తనకు తెలిసినంతవరకూ ఇదే తొలిసారని చెప్పారు. ట్రంప్ హార్ట్ రేట్, బీపీ అన్నీ నార్మల్‌గా ఉన్నాయని చెప్పారు. 6 అడుగుల 3 అంగుళాల ఎత్తున్న ట్రంప్ 108 కిలోల బరువున్నారని పేర్కొన్నారు.