వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేళ్ల తెలుగు బాలిక శ్రావ్య శ్రావ్య అన్నపరెడ్డిని సత్కరించారు. గర్ల్స్ స్కౌట్ మెంబర్‌గా ఉన్న శ్రావ్య.. యూఎస్‌లో కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది సేవలకు మద్దతు తెలుపుతూ, వారిలో ఉత్సహం నింపేలా వ్యక్తిగత కార్డులను పంపించారు. దీనిని గుర్తించిన డోనాల్డ్ ట్రంప్.. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో శ్రావ్యను ప్రశంసించారు. ఆమెతో పాటుగా లైలా ఖాన్, లారెన్ మాట్నీ అనే మరో ఇద్దరు బాలికలను కూడా ట్రంప్ సత్కరించారు.
మేరీల్యాండ్ ఎల్క్‌రిడ్జ్‌లోని ట్రూప్ 744 కు చెందిన ఈ ముగ్గురు బాలికలు 100 బాక్స్‌ల గర్ల్స్ స్కౌట్స్ కుకీస్‌ను స్థానిక అగ్నిమాపక, వైద్య సిబ్బందికి విరాళంగా ఇచ్చారు. శ్రావ్య విషయానికి వస్తే.. హనోవర్‌లో నివాసం ఉంటున్న ఆమె ప్రస్తుతం నాలుగో గ్రేడ్ చదువుతున్నారు. తనకు దక్కిన గౌరవంపై శ్రావ్య స్పందిస్తూ.. ‘నా తల్లిదండ్రులు నన్ను భారతీయ పద్దతి ప్రకారం పెంచారు. నేను వసుధైక కుటుంబం సిద్ధాంతాన్ని నమ్ముతాను’ అని చెప్పారు.(చదవండి : ట్రంప్‌పై ఒబామా సంచలన వ్యాఖ్యలు)
శ్రావ్య తల్లిదండ్రుల విషయానికి వస్తే.. ఆమె తండ్రి విజయ్‌రెడ్డి అన్నపరెడ్డి ఫార్మాసిస్ట్‌గా ఉన్నారు. ఆయన స్వస్థలం గుంటూరు టౌన్. శ్రావ్య తల్లి సీత కల్లం విశాఖపట్నం ఆంధ్ర మెడికల్‌లో మెడికల్ డిగ్రీ పూర్తిచేశారు. ఆమెది బాపట్ల సమీపంలోని నరసయ్య పాలెం స్వస్థలం. ట్రంప్ చేతుల మీదుగా శ్రావ్య సత్కారం అందుకోవడంపై విజయ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శ్రావ్యకు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే చాలా ఇష్టమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment