వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ఆయన సోదరుడి కుమార్తె మేరీ ట్రంప్ ప్రపంచానికి తెలియని కొత్త విషయాలను వెల్లడించనున్నారు. ట్రంప్ గురించి ఆమె ‘టూ మచ్ అండ్ నెవర్ ఎనఫ్: హౌ మై ఫ్యామిలీ క్రియేటెడ్ వరల్డ్ మోస్ట్ డేంజరస్ మెన్’ పుస్తకాన్ని రాశారు. ఇందులో ట్రంప్‌లోని మరో కోణాన్ని బయటపెట్టినట్లు తెలుస్తోంది. పారనాయిడ్ స్కిజోఫ్రేనియా (భ్రాంతిలో బతికేయడం)తో బాధపడుతున్న రోగులను ఆరు నెలలపాటు లోతైన అధ్యయనం చేసిన తర్వాత మేరీ ట్రంప్ ఈ పుస్తక రచనకు పూనుకోవడం విశేషం. పీడకలలు, విధ్వంసకర సంబంధాలు, కుటుంబం విచ్ఛిన్నమవడంపైనా పుస్తకంలో ప్రస్తావించారు. మరణించిన తన తండ్రి జూనియర్ ఫ్రెడ్, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న హానికర సంబంధ బాంధవ్యాలను ఆమె పుస్తకంలో రాసుకొచ్చారు. (వీసాలపై ట్రంప్ నిర్ణయం.. పిచాయ్ స్పందన)
కాగా ఫ్రెడ్ మరణానికి సోదరుడు ట్రంప్ తీరు కూడా కారణమని ఫ్రెడ్ స్నేహితులు గతంలో పేర్కొన్నారు. ఈ విషయంపై ట్రంప్ కూడా ఒకానొక సందర్భంలో తన సోదరుడితో ప్రవర్తించిన తీరుపై చింతిస్తున్నానని విచారం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ పుస్తకం వచ్చే నెల మార్కెట్లో విడుదల కానుంది. అయితే దీన్ని ఎలాగైనా అడ్డుకునేందుకు ట్రంప్ కుటుంబం యత్నిస్తోందని మేరీ తరపు న్యాయవాది థియోడర్ బౌట్రస్ పేర్కొన్నారు. మరోవైపు మేరీ తన గురించి పుస్తకం రాస్తుందని ట్రంప్ ఊహించలేకపోయారు. గతంలో చేసుకున్న ఒప్పందం వల్ల ఇది అసాధ్యమని ఆయన భావించారు. ఇక ఈ పుసక్తం విడుదలను అడ్డుకోవాలని ట్రంప్ సోదరుడు రాబర్ట్ కోర్టును ఆశ్రయించారు. కేవలం తన సొంత లాభం కోసమే ఇన్నేళ్ల తర్వాత ఆమె పుస్తక రచనకు పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కుటుంబ సంబంధాలను దెబ్బతీసే కుట్రతో పాటు ఆమె తన తండ్రికి అన్యాయం చేసినట్లేనని విమర్శించారు. అయితే ఆయన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోని కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ విషయంపై న్యూయార్క్ స్టేట్ సుప్రీంకోర్టుకు వెళతామని రాబర్ట్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. కాగా మేరీ ట్రంప్ 2001లో సైకాలజీలో మాస్టర్ డిగ్రీ, 2003లో క్లినికల్ సైకాలజీలో మాస్టర్స్, 2010లో క్లినికల్ సైకాలజీలో డాక్టోరల్ డిగ్రీ అభ్యసించారు. గతంలో ట్రంప్ ఎన్నికైన రోజున ‘ఇది నా జీవితంలోనే చెత్త రోజు’ అని 12 సార్లు రాసిన ట్వీట్‌ను మేరీ షేర్ చేశారు. ఈ మధ్యే ఆ ట్వీట్‌ను తొలగించారు. (అన్నంత పని చేసిన డొనాల్డ్ ట్రంప్)
Comments
Please login to add a commentAdd a comment