న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దివాళీ ఆటం బాంబులా చెలరేగారు. భారత సంతతికి చెందిన వారి గౌరవార్ధం వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన దివాళీ వేడుకల్లో రెచ్చిపోయారు. ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) చైర్మన్, ఇండో అమెరికన్ అజిత్ పాయ్ టార్గెట్‌గా తనదైన శైలిలో మండిపడ్డారు. ఈ ఏడాది జులైలో ట్రిబ్యూన్ మీడియాను సిన్‌క్లెయిర్ బ్రాడ్‌కాస్ట్ గ్రూప్ టేకోవర్ చేయడానికి ఎఫ్‌సీసీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడాన్ని ట్రంప్ తప్పుపట్టారు. ఎఫ్‌సీసీ నిర్ణయం విచారకరం, అసమంజసమని అప్పట్లోనే అభివర్ణించారు. అయితే ఇదే విషయం మనసులో పెట్టుకున్న ట్రంప్ దివాళీ వేడకలకు హాజరైన అజిత్ పాయ్‌ను ఏకంగా పేరు పెట్టి పిలిచి మరీ ముందుకు పిలిపించుకున్నారు.
అజిత్ తీసుకున్న ఓ నిర్ణయం తనకు ఎంతమాత్రం నచ్చలేదని, ఆయన నిర్ణయం అసలు నచ్చకపోయినా ఆయనకు ఆ స్వతంత్రత ఉందని అందరి సమక్షంలో వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడి సూచనల మేరకు అధికారులు నామినేట్ అయినప్పటికీ ఎఫ్‌సీసీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. అజిత్ పాయ్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో నియమితులవగా, ఎఫ్‌సీసీ చీఫ్‌గా ట్రంప్ ఆయనను ప్రమోట్ చేశారు.
ఇక ట్రిబ్యూన్‌ను కొనుగోలు చేయడం ద్వారా 70 శాతం అమెరికన్ లోగిళ్లలోకి రీచ్‌ను పెంచుకోవాలని టీవీ దిగ్గజం సిన్‌క్లెయిర్ ప్రణాళికలు రూపొందించుకుంది. సిన్‌క్లెయిర్ ట్రిబ్యూన్ డీల్‌కు ట్రంప్ సానుకూలంగా ఉండగా, ఎఫ్‌సీసీ ఈ ప్రతిపాదనకు చెక్ పెట్టడం దుమారం రేపింది. మరోవైపు ఫేక్‌న్యూస్ ప్రసారం చేసిన టీవీ న్యూస్ ఛానెళ్ల లైసెన్సుల పునరుద్ధరణపై 2017లో అధ్యక్షుడికి వ్యతిరేకంగా పాయ్ పనిచేశారు. ఆయా ఛానెళ్ల లైసెన్సుల పునరుద్ధరణపై ట్రంప్ సూచనలను పాయ్ పెడచెవినపెట్టారు. ఆయా సందర్భాల్లో తన నిర్ణయాన్ని అజిత్ పాయ్ గట్టిగా సమర్ధించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment