వాషింగ్టన్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వలస విధానంలో సమూల సంస్కరణల్ని చేపట్టి ప్రతిభ ఆధారంగా వీసాలు మంజూరు చేసే క్రమంలో డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ ప్రోగ్రాం(డీఏసీఏ)ను రద్దు చేసేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా చిన్నవయస్సులోనే తల్లిదండ్రులతో పాటు వచ్చిన వారు, చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వారికి ప్రభుత్వపరంగా రక్షణలు కల్పిస్తూ ఒబామా సర్కారు 2012లో డీఏసీఏ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆది నుంచి దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ట్రంప్.. ప్రముఖ అమెరికా మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. (హెచ్ 1బీ ఆపేశారు)
‘‘ఎంతో శ్రేష్టమైన, కీలకమైన బిల్లును ప్రవేశపెట్టబోతున్నాం. ప్రతిభ ఆధారిత బిల్లు అందులో డీఏసీఏ కూడా ఇమిడి ఉంటుంది. ఇది పౌరసత్వానికి రోడ్‌మ్యాప్‌లా ఉంటుంది. నాకు తెలిసి ఇది ఎంతో మంది ప్రజలకు సంతోషాన్నిస్తుంది’’ అని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘అధ్యక్షుడు ఈరోజు ప్రకటించినట్లుగా.. అమెరికా వర్కర్లను కాపాడేందుకు ప్రతిభ ఆధారిత ఇమ్మిగ్రేషన్ విధానాన్ని తీసుకువచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గురించి తీవ్రంగా కృషి చేస్తున్నారు.
అంతేగాక డీఏసీఏపై చట్టసభలో తీర్మానానికి కాంగ్రెస్ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులోనే పౌరసత్వం, సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు, శాశ్వత ప్రతిభ ఆధారిత వలస విధాన సంస్కరణలు కూడా ఉంటాయి’’ అని తెలిపింది. ఇందులో ఎవరికీ మినహాయింపులు ఉండవనీ.. అయితే ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని వ్యతిరేకించే డెమొక్రాట్లు దీనిని కూడా వ్యతిరేకిస్తామనడం దురదృష్టకరమని పేర్కొంది. (హెచ్1 బీ వీసాదారులకు బిడెన్ తీపి కబురు)
అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ట్రంప్ కఠిన వలస నిబంధనలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జీరో టాలరెన్స్ విధానంతో ఎంతో మందిని దేశ సరిహద్దుల వద్దే నిలిపివేశారు. ఈ క్రమంలో ఎన్నెన్నో హృదయవిదారక ఘటనలకు సంబంధించిన ఫొటోలు చూసి ప్రపంచమంతా కన్నీరు పెట్టింది. అయితే రెండోసారి కూడా వలస వ్యతిరేక ఎజెండాతో గద్దెనెక్కాలని భావిస్తున్న ట్రంప్.. ఇమ్మిగ్రేషన్ విధానికి సంబంధించి కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అమెరికాలో విదేశీ వృత్తి నిపుణులు ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్–1బీ, హెచ్–2బీ, జే, ఎల్1, ఎల్2 వీసాలపై నిషేధాన్ని ఈ ఏడాది చివరి వరకు పొడిగించారు.
అదే విధంగా గ్రీన్‌కార్డుల జారీని కూడా 2020 డిసెంబర్ వరకు నిలిపివేశారు. అంతేగాక ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించే యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా నిబంధనలు తీసుకువచ్చారు. ఇక తాజాగా ఆయన డీఏసీఏపై మరోసారి దృష్టి సారించారు. దేశంలో ఉన్న దాదాపు ఆరున్నర లక్షల యువ వలసదారుల ఆశలపై నీళ్లు చల్లేలా డీఏసీఏను ఉపసంహరించేందుకు ట్రంప్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ట్రంప్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డీఏసీఏ ఉపసంహరణ తీరు సరిగాలేదని ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి డీఏసీఏ గురించి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment