DACA
-
వలస విధానం: ట్రంప్ మరో సంచలనం !
వాషింగ్టన్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వలస విధానంలో సమూల సంస్కరణల్ని చేపట్టి ప్రతిభ ఆధారంగా వీసాలు మంజూరు చేసే క్రమంలో డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ ప్రోగ్రాం(డీఏసీఏ)ను రద్దు చేసేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా చిన్నవయస్సులోనే తల్లిదండ్రులతో పాటు వచ్చిన వారు, చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వారికి ప్రభుత్వపరంగా రక్షణలు కల్పిస్తూ ఒబామా సర్కారు 2012లో డీఏసీఏ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆది నుంచి దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ట్రంప్.. ప్రముఖ అమెరికా మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. (హెచ్ 1బీ ఆపేశారు) ‘‘ఎంతో శ్రేష్టమైన, కీలకమైన బిల్లును ప్రవేశపెట్టబోతున్నాం. ప్రతిభ ఆధారిత బిల్లు అందులో డీఏసీఏ కూడా ఇమిడి ఉంటుంది. ఇది పౌరసత్వానికి రోడ్‌మ్యాప్‌లా ఉంటుంది. నాకు తెలిసి ఇది ఎంతో మంది ప్రజలకు సంతోషాన్నిస్తుంది’’ అని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘అధ్యక్షుడు ఈరోజు ప్రకటించినట్లుగా.. అమెరికా వర్కర్లను కాపాడేందుకు ప్రతిభ ఆధారిత ఇమ్మిగ్రేషన్ విధానాన్ని తీసుకువచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గురించి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అంతేగాక డీఏసీఏపై చట్టసభలో తీర్మానానికి కాంగ్రెస్ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులోనే పౌరసత్వం, సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు, శాశ్వత ప్రతిభ ఆధారిత వలస విధాన సంస్కరణలు కూడా ఉంటాయి’’ అని తెలిపింది. ఇందులో ఎవరికీ మినహాయింపులు ఉండవనీ.. అయితే ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని వ్యతిరేకించే డెమొక్రాట్లు దీనిని కూడా వ్యతిరేకిస్తామనడం దురదృష్టకరమని పేర్కొంది. (హెచ్1 బీ వీసాదారులకు బిడెన్ తీపి కబురు) అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ట్రంప్ కఠిన వలస నిబంధనలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జీరో టాలరెన్స్ విధానంతో ఎంతో మందిని దేశ సరిహద్దుల వద్దే నిలిపివేశారు. ఈ క్రమంలో ఎన్నెన్నో హృదయవిదారక ఘటనలకు సంబంధించిన ఫొటోలు చూసి ప్రపంచమంతా కన్నీరు పెట్టింది. అయితే రెండోసారి కూడా వలస వ్యతిరేక ఎజెండాతో గద్దెనెక్కాలని భావిస్తున్న ట్రంప్.. ఇమ్మిగ్రేషన్ విధానికి సంబంధించి కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అమెరికాలో విదేశీ వృత్తి నిపుణులు ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్–1బీ, హెచ్–2బీ, జే, ఎల్1, ఎల్2 వీసాలపై నిషేధాన్ని ఈ ఏడాది చివరి వరకు పొడిగించారు. అదే విధంగా గ్రీన్‌కార్డుల జారీని కూడా 2020 డిసెంబర్ వరకు నిలిపివేశారు. అంతేగాక ఆన్లైన్ క్లాసులు నిర్వహించే యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా నిబంధనలు తీసుకువచ్చారు. ఇక తాజాగా ఆయన డీఏసీఏపై మరోసారి దృష్టి సారించారు. దేశంలో ఉన్న దాదాపు ఆరున్నర లక్షల యువ వలసదారుల ఆశలపై నీళ్లు చల్లేలా డీఏసీఏను ఉపసంహరించేందుకు ట్రంప్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ట్రంప్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డీఏసీఏ ఉపసంహరణ తీరు సరిగాలేదని ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి డీఏసీఏ గురించి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
డీఏసీఏపై ట్రంప్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
వాషింగ్టన్: వలస వ్యతిరేక ఎజెండాతో అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికయ్యేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్‌కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో ఉన్న 6.50 లక్షల యువ వలసదారులకు ప్రభుత్వపరమైన రక్షణల రద్దుకు ట్రంప్ చేస్తున్న యత్నాలకు బ్రేక్ పడింది. చిన్నవయస్సులోనే తల్లిదండ్రులతోపాటు వచ్చిన వారు, చట్టవిరుద్ధంగా ఉంటున్న వారికి ప్రభుత్వపరంగా రక్షణలు కల్పిస్తూ ఒబామా ప్రభుత్వం 2012లో డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ ప్రోగ్రాం(డీఏసీఏ) తీసుకువచ్చింది. దీన్ని ట్రంప్ వ్యతిరేకించారు.తాజాగా డీఏసీఏ విధానం అక్రమమనీ, దీనిపై సమీక్షించేందుకు కోర్టులకు అధికారం లేదని ట్రంప్ ప్రభుత్వం తరఫు లాయర్లు వాదించారు. ఈ వాదనను ప్రధాన జడ్జి జాన్ రాబర్ట్స్, మరో నలుగురు జడ్జీలు తిరస్కరించారు. ‘డీఏసీఏ ఉపసంహరణ తీరు సరిగాలేదని ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
డీఏసీఏపై మరో ఆలోచన లేదు: ట్రంప్
పామ్ బీచ్: అమెరికాలో స్వాప్నికుల (డ్రీమర్ల)కు సంబంధించిన డీఏసీఏపై మరో ఆలోచన లేదని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం స్పష్టం చేశారు. డీఏసీఏ కార్యక్రమాన్ని ట్రంప్ ఇప్పటికే రద్దు చేయడం తెలిసిందే. చిన్నతనంలో తల్లిదండ్రులతోపాటు అక్రమంగా అమెరికా వచ్చి స్థిరపడిపోయిన అనేక మంది స్వాప్నికులకు అమెరికాలో నివసించేందుకు మాజీ అధ్యక్షుడు ఒబామా అనుమతులిస్తూ గతంలో డీఏసీఏ పథకాన్ని తీసుకొచ్చారు. ‘డీఏసీఏ కింద స్వాప్నికులకు ఇస్తున్న ప్రయోజనాల కోసం వారు వస్తున్నారు’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఆ వారెవరనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. డీఏసీఏను ట్రంప్ రద్దు చేసినా, ఆ పథకాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌కు ఆరు నెలల సమయమిచ్చారు. అయితే డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఏకాభిప్రాయం లేక అది ఇంకా సాధ్యపడలేదు. -
స్వాప్నికుల్లో డీఏసీఏ గుబులు
♦ భారతీయులు 20 వేల మంది ఉన్నట్లు తాజా అంచనా ♦ ఉద్యోగులకు బాసటగా నిలుస్తున్న దిగ్గజ టెక్ కంపెనీలు వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా తీసుకొచ్చిన డీఏసీఏ (బాల్యంలో వచ్చిన వారిపై చర్యల వాయిదా) కార్యక్రమాన్ని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేయడంతో అనేకమంది ‘స్వాప్నికులు’ తమను దేశం నుంచి పంపించేస్తారని ఆందోళన చెందుతున్నారు. చిన్నప్పుడే తల్లిదండ్రులతోబాటు అమెరికా వచ్చి, అక్కడ నివసించడానికి చట్టపరంగా ఏ అనుమతులూ లేకుండా అక్రమంగా ఉంటున్న వారిని స్వాప్నికులు (డ్రీమర్లు) అని పిలుస్తారు. అమెరికాలో ఉంటున్న భారత్‌కు చెందిన స్వాప్నికుల సంఖ్య 20 వేలకుపైగానే ఉంటుందని తాజా సమాచారం.. ఏ పాపం తెలీకుండా, తమ ప్రమేయమే లేకుండా ఇక్కడకు వచ్చి చిన్నప్పటి నుంచి అమెరికాలోనే ఉంటూ సొంత దేశం గురించి, కనీసం అక్కడి స్థానిక భాష కూడా తెలియని వారిని వెనక్కు పంపించడం భావ్యం కాదని దక్షిణాసియా అమెరికన్ల కోసం పనిచేసే ఓ సంస్థ అధికారిణి సుమన్ రఘునాథన్ అన్నారు. స్వాప్నికుల ప్రయోజనాలను కాపాడేందుకు అమెరికా కాంగ్రెస్ వెంటనే స్పందిచాలని సుమన్ కోరారు. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం కూడా అమెరికాలో పలుచోట్ల నిరసనలు జరిగాయి. పోరాటానికి సిద్ధం: టెక్ కంపెనీలు డీఏసీఏను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం సాగించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా ప్రముఖ టెక్నాలజీ సంస్థలు ప్రకటించాయి. ఆయా కంపెనీల్లో పనిచేస్తూ డీఏసీఏ కింద ఆశ్రయం పొందుతున్న వారికి బాసటగా నిలిచాయి. ట్రంప్ నిర్ణయాన్ని యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఖండించారు. యాపిల్‌లో పనిచేస్తూ.. ట్రంప్ నిర్ణయం వల్ల ప్రభావితులయ్యే వారికి పూర్తి మద్దతుగా నిలుస్తామంటూ ఆయన ఉద్యోగులకు ఓ లేఖ రాశారు. ‘స్వాప్నికులు మన దేశానికి, సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు. 8 లక్షల మంది స్వాప్నికుల హక్కులను కాపాడటం అనివార్యం’ అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. ‘స్వాప్నికులు మన ఇరుగుపొరుగువారు. మన స్నేహితులు. మన సహోద్యోగులు. ఇదే వారి ఇల్లు.’ అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. డీఏసీఏ కార్యక్రమాన్ని మళ్లీ అమల్లోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలంతా కాంగ్రెస్‌ను కోరాలని ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పిలుపునిచ్చారు. స్వాప్నికులపై చర్యలు అమెరికా విలువలకు విరుద్ధమని ఉబర్ సీఈవో అన్నారు. -
ట్రంప్‌ది చాలా క్రూరమైన నిర్ణయం: ఒబామా
వాషింగ్టన్ : చిన్నప్పుడే తల్లిదండ్రులతో పాటు అమెరికా వచ్చి ఉద్యోగాలు చేస్తున్న యువత(డ్రీమర్స్)ను అక్రమ వలసదారులుగా గుర్తించడాన్ని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా ఖండించారు. సుమారు 8 లక్షల మంది డ్రీమర్స్ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్–డీఏసీఏ) వర్క్ పర్మిట్లను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేయడాన్ని క్రూరమైన నిర్ణయంగా ఒబామా అభివర్ణించారు. డ్రీమర్స్ ఆశలు గల్లంతు చేస్తూ ఫైలుపై ట్రంప్ మంగళవారం ఉదయం సంతకం చేయగా, అదేరోజు ట్రంప్ చర్యను ఒబామా తప్పుపట్టారు. డ్రీమర్స్ వర్క్ పర్మిట్లు రద్దు చేయడాన్ని క్రూరమైర నిర్ణయంతో పాటు ట్రంప్ సొంతంగా తన ఓటమిని ఒప్పుకున్నారని అభిప్రాయపడ్డారు. వలసదారుల వల్ల అమెరికాకు పొంచి ఉన్న ప్రమాదమేంలేదని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరంలేదని తన ఫేస్ బుక్ ఖాతాలో ఒబామా పేర్కొన్నారు. పేరెంట్స్ అమెరికాకు రావడమే డ్రీమర్స్ చేసిన తప్పిదం కాదని.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే యువతపై ఆంక్షలు విధించడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా డీఏసీఏను రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోగా.. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డ్రీమర్స్ (డీఏసీఎ) మద్ధతుదారులు అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీఏసీఏ రద్దును ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థల వ్యవస్థాపకులు, సీఈవోలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫేస్బుక్ సీఈవో జుకర్‌బర్గ్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సహా మరికొందరు బిజినెస్ దిగ్గజాలు వలసదారులకు చట్టపరంగా రక్షణ కొనసాగించాలని, డీఏసీఏను రద్దు చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమంటూ ఇప్పటికే ట్రంప్‌కు లేఖ రాశారు. (చదవండి : డ్రీమర్స్ కలల్ని ఛిద్రం చేసిన ట్రంప్) అమెరికాలో నివసించేందుకు, పనిచేసేందుకు అధికారిక ధ్రువీకరణ పత్రాలు లేకున్నా డ్రీమర్లు దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నారని వారిపై దయతో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒబామా 2012లో చట్టపరంగా వెసులుబాటు కల్పించారు. ‘బాల్యంలో వచ్చినవారిపై చర్యల వాయిదా’ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్–డీఏసీఏ) సహాయ కార్యక్రమాన్ని 2012 జూన్ 15న ఆయన ప్రకటించారు. డ్రీమర్స్ రెండేళ్లకొసారి తమ వర్క్ పర్మిట్లను రెన్యూవల్ చేసుకుంటే చాలు ఏ సమస్య లేకుండా అమెరికాలో జాబ్ చేసుకోవచ్చు. -
అమెరికా: 8 లక్షల మంది వర్క్ పర్మిట్లు రద్దు
- స్వాప్నికుల(డ్రీమర్స్) కలల్ని ఛిద్రం చేసిన ట్రంప్ - కీలక ఉత్తర్వులపై సంతకం.. ఆదేశాలు జారీ - 7 వేల మంది భారతీయులపై ప్రభావం సాక్షి, వాషింగ్టన్: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలస దారులు, శరణార్థులపై కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పడు తల్లిదండ్రులతో పాటు అమెరికా వచ్చి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న యువత(డ్రీమర్స్)ను అక్రమ వలసదారులుగా గుర్తించారు. సుమారు 8 లక్షల మంది డ్రీమర్స్ వర్క్ పర్మిట్లను రద్దుచేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై ట్రంప్ మంగళవారం ఉదయం సంతకం చేశారు. ఈ నిర్ణయంతో వీరిలో ఏడు వేల మంది భారతీయ అమెరికన్ యువకులు కూడా ఉన్నారు. అమెరికాలో నివసించేందుకు, పనిచేసేందుకు వీరికి అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేవు. ఈ డ్రీమర్లు దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నారని, వారిపై దయ చూపాలే తప్ప శిక్షించరాదనే అభిప్రాయంతో ఒబామా 2012లో చట్టపరంగా వెసులుబాటు కల్పించారు. ‘బాల్యంలో వచ్చినవారిపై చర్యల వాయిదా’ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్–డీఏసీఏ) సహాయ కార్యక్రమాన్ని 2012 జూన్ 15న ఆయన ప్రకటించారు. అమెరికా ఫెడరల్ సర్కారు నిధులతో అమలయ్యే ఈ కార్యక్రమంలో 8 లక్షల మంది పెట్టుకున్న దరఖాస్తుల్ని ఆమోదించారు. వీరు ప్రతి రెండేళ్లకు తమ వర్క్ పర్మిట్లను పొడిగించుకునే అవకాశం కల్పించారు. ఆ వర్క్ పర్మిట్లనే ట్రంప్ నేడు రద్దు చేశారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లే..: అధికారంలోకి రాగానే డీఏసీఏను రద్దు చేస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ హామీనిచ్చారు. వర్క్ పర్మిట్ల పునరుద్ధరణను రద్దు చేసి, వారిని స్వదేశాలకు పంపాలని రెండేళ్ల క్రితమే డిమాండ్ మొదలైంది. డ్రీమర్ల వల్ల స్థానిక అమెరికన్ల ఉపాధికి ప్రమాదమని, వారిలో కొందరు చట్టవ్యతిరేక కార్యకలా పాల్లో పాల్గొంటున్నారని ట్రంప్ మద్దతుదారుల ఆరోపణ. ఈ వలసదారుల్లో ఎక్కువమంది పొరుగుదేశమైన మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికా దేశాలకు చెందినవారే. భారత్, వియత్నాం వంటి ఆసియా దేశాలకు చెందిన యువత తొమ్మిది శాతం వరకూ ఉండొచ్చని అంచనా. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టెక్ దిగ్గజాలు: ఇన్ని లక్షల మందిని అర్ధంతరంగా వారికి తెలియని దేశాలకు పంపడం అన్యాయమని అన్ని పార్టీల నేతలు వాదిస్తున్నారు. డీఏసీఏ రద్దును ఫేస్బుక్ సీఈవో జుకర్‌బర్గ్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అమెజాన్ సీఈవోలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వలసదారులకు చట్టపరంగా రక్షణ కొనసాగించాలని, డీఏసీఏను రద్దు చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమంటూ 300 మంది టెక్, బిజినెస్ దిగ్గజాలు ఇప్పటికే ట్రంప్‌కు లేఖ రాశారు. పాలకపక్షమైన రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనెటర్లు, ప్రతినిధుల సభ సభ్యులు, స్పీకర్ కూడా రద్దును వద్దని కోరుతున్నారు. కాగా ఒబామా హయాంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని మంగళవారంలోగా రద్దు చేయకుంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు హెచ్చరించాయి.