ట్రంప్‌ది చాలా క్రూరమైన నిర్ణయం: ఒబామా
వాషింగ్టన్ : చిన్నప్పుడే తల్లిదండ్రులతో పాటు అమెరికా వచ్చి ఉద్యోగాలు చేస్తున్న యువత(డ్రీమర్స్)ను అక్రమ వలసదారులుగా గుర్తించడాన్ని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా ఖండించారు. సుమారు 8 లక్షల మంది డ్రీమర్స్ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్–డీఏసీఏ) వర్క్ పర్మిట్లను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేయడాన్ని క్రూరమైన నిర్ణయంగా ఒబామా అభివర్ణించారు. డ్రీమర్స్ ఆశలు గల్లంతు చేస్తూ ఫైలుపై ట్రంప్ మంగళవారం ఉదయం సంతకం చేయగా, అదేరోజు ట్రంప్ చర్యను ఒబామా తప్పుపట్టారు. డ్రీమర్స్ వర్క్ పర్మిట్లు రద్దు చేయడాన్ని క్రూరమైర నిర్ణయంతో పాటు ట్రంప్ సొంతంగా తన ఓటమిని ఒప్పుకున్నారని అభిప్రాయపడ్డారు.
వలసదారుల వల్ల అమెరికాకు పొంచి ఉన్న ప్రమాదమేంలేదని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరంలేదని తన ఫేస్ బుక్ ఖాతాలో ఒబామా పేర్కొన్నారు. పేరెంట్స్ అమెరికాకు రావడమే డ్రీమర్స్ చేసిన తప్పిదం కాదని.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే యువతపై ఆంక్షలు విధించడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా డీఏసీఏను రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోగా.. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డ్రీమర్స్ (డీఏసీఎ) మద్ధతుదారులు అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
డీఏసీఏ రద్దును ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థల వ్యవస్థాపకులు, సీఈవోలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సహా మరికొందరు బిజినెస్ దిగ్గజాలు వలసదారులకు చట్టపరంగా రక్షణ కొనసాగించాలని, డీఏసీఏను రద్దు చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమంటూ ఇప్పటికే ట్రంప్‌కు లేఖ రాశారు.
(చదవండి : డ్రీమర్స్ కలల్ని ఛిద్రం చేసిన ట్రంప్)
అమెరికాలో నివసించేందుకు, పనిచేసేందుకు అధికారిక ధ్రువీకరణ పత్రాలు లేకున్నా డ్రీమర్లు దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నారని వారిపై దయతో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒబామా 2012లో చట్టపరంగా వెసులుబాటు కల్పించారు. ‘బాల్యంలో వచ్చినవారిపై చర్యల వాయిదా’ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్–డీఏసీఏ) సహాయ కార్యక్రమాన్ని 2012 జూన్ 15న ఆయన ప్రకటించారు. డ్రీమర్స్ రెండేళ్లకొసారి తమ వర్క్ పర్మిట్లను రెన్యూవల్ చేసుకుంటే చాలు ఏ సమస్య లేకుండా అమెరికాలో జాబ్ చేసుకోవచ్చు.