Deferred Action for Childhood Arrivals
-
డ్రీమర్లకు యూఎస్ కోర్టు షాక్!
హూస్టన్: దాదాపు 6 లక్షల మంది వలసదారులను స్వదేశాలకు తరలించకుండా రక్షణ కల్పిస్తున్న డాకా(డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్) చట్టం చెల్లదని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. బరాక్ ఒబామా హయాంలో తీసుకువచ్చిన ఈ చట్టంతో ఇప్పటివరకు పలువురు భారతీయ యువతకు రక్షణ లభిస్తూ వచ్చింది. డ్రీమర్స్‌గా పిలిచే ఈ యువతకు శరాఘాతం కలిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో డ్రీమర్స్‌ను రక్షించాలన్న బైడెన్ ప్రభుత్వ యత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలనట్లయింది. ఈ చట్టం రూపొందించడంలో ఒబామా ప్రభుత్వం పరిధి దాటిందని న్యాయమూర్తి ఆండ్రూ హనెన్ అభిప్రాయపడ్డారు. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి ఈ చట్టాన్ని రూపొందించే అధికారాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని, ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోకుండా ఈ చట్టం అడ్డుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చట్టం అనైతికమని, అందువల్ల ఇకపై డాకా అప్లికేషన్ల ఆమోదాన్ని నిలిపివేయాలని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖను న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఇప్పటికే స్వీకరించిన అప్లికేషన్లపై తీర్పు ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు. టెక్సాస్ సహా పలు రిపబ్లికన్ రాష్ట్రాలు డాకాకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశాయి. ఈ చట్టం కారణంగా తాము అదనపు వ్యయాలు భరించాల్సివస్తోందని ఈ రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయి. తాజాగా డాకాపై తీర్పునిచ్చిన న్యాయమూర్తిని గతంలో బుష్ ప్రభుత్వం నియమించింది. -
వలస విధానంపై ట్రంప్‌కి చుక్కెదురు
వాషింగ్టన్: వలసదారుల వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి న్యాయస్థానంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మైనర్లుగా ఉన్నప్పుడే చట్టవిరుద్ధంగా తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చిన వారికి రక్షణ కల్పించడానికి ఒబామా హయాం నాటి వలస విధానాలను పునరుద్ధరించాలని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో భారత్ సహా వివిధ దేశాల నుంచి అమెరికాకి అక్రమంగా వచ్చిన చిన్నారులకి రక్షణ కల్పించడానికి బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) విధానాన్ని రద్దు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాలకు అమెరికా కోర్టు అప్పట్లో అడ్డుకట్ట వేసింది. మరో రెండేళ్ల పాటు డీఏసీఏని కొనసాగించాలని న్యూయార్క్ జిల్లా న్యాయమూర్తి, సుప్రీంకోర్టులో కూడా న్యాయమూర్తి అయిన నికోలస్ గరాఫీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీని ఆదేశించారు. చట్టపర రక్షణ కోసం వలసదారులు చేసుకునే దరఖాస్తుల్ని సోమవారం నుంచి స్వీకరించాలని స్పష్టం చేశారు. 2017 నుంచి డీఏసీఏ విధానం కింద దరఖాస్తుల్ని తీసుకోవడం ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది. మళ్లీ మూడేళ్ల తర్వాత ఈ విధానం ద్వారా చిన్నతనంలోనే అక్రమ మార్గాల ద్వారా దేశంలోకి వచ్చిన వారికి రక్షణ కలగనుంది. చిన్న వయసులో తల్లిదండ్రులతో కలిసి వచ్చిన వారికి రక్షణ కల్పించి, వారికి ఉపాధి మార్గం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని న్యాయమూర్తి నికోలస్ పేర్కొన్నారు. 2019 నాటి సౌత్ ఏసియన్ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్ (సాల్ట్) నివేదిక ప్రకారం భారత్ నుంచి 6 లక్షల 30 వేల మంది అక్రమ వలసదారులు అమెరికాలో ఉన్నారు. 2010 నుంచి పదేళ్లలో వారి సంఖ్య 72 శాతం పెరిగింది. అదే సంవత్సరం భారత్ నుంచి వచ్చిన వారిలో 2,550 మందికి డీఏసీఏ ద్వారా రక్షణ లభించింది. -
ఆన్లైన్ ఎంచుకుంటే అమెరికా రావద్దు
వాషింగ్టన్: వీసా విధానంలో రోజుకో మార్పు తీసుకువస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థుల అంశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా విద్యా సంస్థల్లో ఆన్లైన్ మాధ్యమంలో బోధనను ఎంపిక చేసుకునే కొత్త విద్యార్థులెవరినీ దేశంలోకి రానివ్వకూడదని ఆయన నిర్ణయించారు. ఈ సెప్టెంబర్ నుంచి మొదలయ్యే సెమిస్టర్లో ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులెవరూ దేశంలోకి అడుగు పెట్టకూడదని అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ (ఐసీఈ) ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనికి కటాఫ్ తేదీని మార్చి 9గా నిర్ణయించింది. ఆ తేదీ తర్వాత కొత్త విద్యార్థులెవరైనా ఆన్లైన్ బోధనా పద్ధతుల్ని ఎంపిక చేసుకుంటే అమెరికా రావడానికి వీల్లేదని ఐసీఈ స్పష్టం చేసింది. కొత్తగా జాయిన్ అయిన విదేశీ విద్యార్థులెవరికీ ఫారమ్ 1–20 జారీ చేయవద్దంటూ దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలను హోంల్యాండ్ సెక్యూరిటీలోని స్టూడెంట్స్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (ఎస్ఈవీపీ) ఆదేశించింది. స్టూడెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆ ఫారమ్స్ అత్యంత కీలకం. ఈ విద్యా సంవత్సరంలో భారత్‌కు చెందిన విద్యార్థులకే అత్యధికంగా అమెరికా విద్యాసంస్థల్లో సీటు వచ్చింది. కొత్తగా సీటు వచ్చిన భారతీయ విద్యార్థులు దాదాపుగా 2 లక్షల మంది వరకు ఉండవచ్చునని ఒక అంచనా. అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశీయ, విదేశీ విద్యార్థులు ఎక్కువ మంది ఆన్లైన్ బోధనా పద్ధతుల్ని ఎంపిక చేసుకుంటున్నారు. అమెరికాలో ఉంటూ ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు ఇచ్చి సర్వత్రా నిరసనలు వెల్లువెత్తడంతో తన నిర్ణయాన్ని ట్రంప్ సర్కార్ వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. విద్యా సంస్థల్ని బలవంతంగానైనా తెరిపించడానికే ట్రంప్ ఇలా రోజుకో వివాదాస్పద నిర్ణయం తీసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. డీఏసీఏ దరఖాస్తులూ పెండింగ్‌లో చిన్నతనంలో అమెరికాకి వచ్చి, యుక్త వయసు వచ్చాక ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) దరఖాస్తులని సర్కార్ పెండింగ్‌లో ఉంచింది. గత నెలలో సుప్రీం కోర్టు డీఏసీఏని ఆపేయడం సరికాదని వ్యాఖ్యానించినప్పటికీ సర్కార్ పెడచెవిన పెట్టింది. మేరీల్యాండ్‌లో అమెరికా జిల్లా కోర్టు డీఏసీఏని తిరిగి పాత పద్ధతిలోకి తీసుకురావాలని ఆదేశించిన నేపథ్యంలో ఆ దరఖాస్తులన్నీ పెండింగ్‌లో ఉన్నట్టుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. వర్క్ పర్మిట్లలోనూ జాప్యం అమెరికాలో హెచ్4 వీసాలపై ఉన్న జీవిత భాగస్వాములకు పని చేయడానికి వీలుగా జారీ చేసే వర్క్ పర్మిట్లలోనూ∙జాప్యం జరుగుతోంది. ఈ మేరకు భారత్‌కు చెందిన మహిళ రంజిత సుబ్రహ్మణ్యం ఓహియో ఫెడరల్ కోర్టుకెక్కింది. ఈ ఏడాది ఏప్రిల్ 7న తనకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ)కి ఆమోదించినప్పటికీ ఇప్పటివరకు తనకు అది అందలేదని ఆమె కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అంతకు ముందు ఉన్న ఈఏడీ గడువు జూన్‌లో ముగిసిపోవడం, కొత్తది అం దకపోవడంతో తాను ఉద్యోగాన్ని కోల్పోయానని తెలిపారు. సాధారణంగా వర్క్ పర్మిట్‌కు అనుమతి వచ్చిన రెండు రోజుల్లోనే ఈఏడీ కార్డుని వారికి పం పాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 75 వేల కార్డులు ప్రింట్ కాకుండా పెండింగ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. -
డీఏసీఏ రద్దు ?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వలస విధానాన్ని తీసుకురావడానికి కసరత్తు ముమ్మరం చేశారు. ప్రతిభ ఆధారిత వలస విధానానికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులకు తుదిరూపం తీసుకువచ్చే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా డిఫర్డ్ యాక్షన్స్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవడానికి సంకల్పించారు. ఈ మేరకు శుక్రవారం వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతకు ముందు ట్రంప్ ఒక టీవీ చానెల్‌తో మాట్లాడుతూ చట్టవిరుద్ధంగా ఎవరూ అమెరికాలో నివసించకుండా అత్యంత పటిష్టమైన బిల్లును తీసుకువస్తున్నామని చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ స్థానికుల మెప్పు పొందడానికి గత కొన్నాళ్లుగా వలస విధానాలను సంస్కరించడంపైనే దృష్టి సారించారు. గత ప్రభుత్వం వలస విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. డీఏసీఏను కూడా ఉపసంహరించడానికి కూడా ప్రయత్నాలు చేశారు. అయితే దీనిపై ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు సరిగా లేవంటూ అమెరికా సుప్రీం కోర్టు ఇటీవల ఆ ప్రణాళికలకు అడ్డుకట్ట వేసింది. దీంతో ట్రంప్ ఈ కార్యక్రమాన్ని వలస విధానంలో చేర్చి పూర్తిగా దానిని రద్దు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డీఏసీఏకు చట్టబద్ధమైన పరిష్కారం, సరిహద్దుల్లో భద్రత, ప్రతిభ ఆధారంగా శాశ్వత ప్రాతిపదికన సంస్కరణలపై కాంగ్రెస్‌లో చర్చించడానికి సిద్ధమేనని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. డీఏసీఏ అంటే? 2012లో ఒబామా సర్కార్ మానవతా దృక్పథంతో డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం చిన్నప్పుడే తల్లిదండ్రులతో అమెరికాకి వచ్చి ఉంటున్న వారికి ఇది చట్టపరమైన రక్షణ కల్పిస్తుంది. అమెరికా పౌరసత్వం, లేదంటే చట్టపరంగా నివాస హక్కులు లేనివారికి డీఏసీఏ ఒక వరంలాంటిది. దాదాపుగా 7 లక్షల మంది యువత డీఏసీఏతో లబ్ధి పొందుతున్నారు. వీరందరికీ వర్క్ పర్మిట్లు, హెల్త్ ఇన్సూరెన్స్‌లు ఈ కార్యక్రమం కింద లభిస్తాయి. ప్రతీ రెండేళ్లకి ఒకసారి దీనిని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే అమెరికా పౌరసత్వం మాత్రం లభించదు. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి దీనిని వెనక్కి తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు డెమోక్రాట్లు అడ్డం పడుతూనే ఉన్నారు. ఇది చాలా సమగ్రమైన బిల్లు. ఎంతో మంచి బిల్లు. ప్రతిభ ఆధారంగా వలస విధానం ఉంటుంది. ఇందులో డీఏసీఏని కూడా చేరుస్తున్నాం. డీఏసీఏ ద్వారా లబ్ధి పొందుతున్న వారికి అమెరికా పౌర సత్వం లభించేలా కొత్త విధానం బాటలు వేస్తుం ది. దీనిపై ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తారు’ డోనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు -
ట్రంప్‌ది చాలా క్రూరమైన నిర్ణయం: ఒబామా
వాషింగ్టన్ : చిన్నప్పుడే తల్లిదండ్రులతో పాటు అమెరికా వచ్చి ఉద్యోగాలు చేస్తున్న యువత(డ్రీమర్స్)ను అక్రమ వలసదారులుగా గుర్తించడాన్ని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా ఖండించారు. సుమారు 8 లక్షల మంది డ్రీమర్స్ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్–డీఏసీఏ) వర్క్ పర్మిట్లను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేయడాన్ని క్రూరమైన నిర్ణయంగా ఒబామా అభివర్ణించారు. డ్రీమర్స్ ఆశలు గల్లంతు చేస్తూ ఫైలుపై ట్రంప్ మంగళవారం ఉదయం సంతకం చేయగా, అదేరోజు ట్రంప్ చర్యను ఒబామా తప్పుపట్టారు. డ్రీమర్స్ వర్క్ పర్మిట్లు రద్దు చేయడాన్ని క్రూరమైర నిర్ణయంతో పాటు ట్రంప్ సొంతంగా తన ఓటమిని ఒప్పుకున్నారని అభిప్రాయపడ్డారు. వలసదారుల వల్ల అమెరికాకు పొంచి ఉన్న ప్రమాదమేంలేదని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరంలేదని తన ఫేస్ బుక్ ఖాతాలో ఒబామా పేర్కొన్నారు. పేరెంట్స్ అమెరికాకు రావడమే డ్రీమర్స్ చేసిన తప్పిదం కాదని.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే యువతపై ఆంక్షలు విధించడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా డీఏసీఏను రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోగా.. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డ్రీమర్స్ (డీఏసీఎ) మద్ధతుదారులు అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీఏసీఏ రద్దును ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థల వ్యవస్థాపకులు, సీఈవోలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫేస్బుక్ సీఈవో జుకర్‌బర్గ్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సహా మరికొందరు బిజినెస్ దిగ్గజాలు వలసదారులకు చట్టపరంగా రక్షణ కొనసాగించాలని, డీఏసీఏను రద్దు చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమంటూ ఇప్పటికే ట్రంప్‌కు లేఖ రాశారు. (చదవండి : డ్రీమర్స్ కలల్ని ఛిద్రం చేసిన ట్రంప్) అమెరికాలో నివసించేందుకు, పనిచేసేందుకు అధికారిక ధ్రువీకరణ పత్రాలు లేకున్నా డ్రీమర్లు దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నారని వారిపై దయతో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒబామా 2012లో చట్టపరంగా వెసులుబాటు కల్పించారు. ‘బాల్యంలో వచ్చినవారిపై చర్యల వాయిదా’ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్–డీఏసీఏ) సహాయ కార్యక్రమాన్ని 2012 జూన్ 15న ఆయన ప్రకటించారు. డ్రీమర్స్ రెండేళ్లకొసారి తమ వర్క్ పర్మిట్లను రెన్యూవల్ చేసుకుంటే చాలు ఏ సమస్య లేకుండా అమెరికాలో జాబ్ చేసుకోవచ్చు.