వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వలస విధానాన్ని తీసుకురావడానికి కసరత్తు ముమ్మరం చేశారు. ప్రతిభ ఆధారిత వలస విధానానికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులకు తుదిరూపం తీసుకువచ్చే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా డిఫర్డ్ యాక్షన్స్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవడానికి సంకల్పించారు. ఈ మేరకు శుక్రవారం వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
అంతకు ముందు ట్రంప్ ఒక టీవీ చానెల్‌తో మాట్లాడుతూ చట్టవిరుద్ధంగా ఎవరూ అమెరికాలో నివసించకుండా అత్యంత పటిష్టమైన బిల్లును తీసుకువస్తున్నామని చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ స్థానికుల మెప్పు పొందడానికి గత కొన్నాళ్లుగా వలస విధానాలను సంస్కరించడంపైనే దృష్టి సారించారు. గత ప్రభుత్వం వలస విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
డీఏసీఏను కూడా ఉపసంహరించడానికి కూడా ప్రయత్నాలు చేశారు. అయితే దీనిపై ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు సరిగా లేవంటూ అమెరికా సుప్రీం కోర్టు ఇటీవల ఆ ప్రణాళికలకు అడ్డుకట్ట వేసింది. దీంతో ట్రంప్ ఈ కార్యక్రమాన్ని వలస విధానంలో చేర్చి పూర్తిగా దానిని రద్దు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డీఏసీఏకు చట్టబద్ధమైన పరిష్కారం, సరిహద్దుల్లో భద్రత, ప్రతిభ ఆధారంగా శాశ్వత ప్రాతిపదికన సంస్కరణలపై కాంగ్రెస్‌లో చర్చించడానికి సిద్ధమేనని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు.
డీఏసీఏ అంటే?
2012లో ఒబామా సర్కార్ మానవతా దృక్పథంతో డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం చిన్నప్పుడే తల్లిదండ్రులతో అమెరికాకి వచ్చి ఉంటున్న వారికి ఇది చట్టపరమైన రక్షణ కల్పిస్తుంది. అమెరికా పౌరసత్వం, లేదంటే చట్టపరంగా నివాస హక్కులు లేనివారికి డీఏసీఏ ఒక వరంలాంటిది. దాదాపుగా 7 లక్షల మంది యువత డీఏసీఏతో లబ్ధి పొందుతున్నారు. వీరందరికీ వర్క్ పర్మిట్లు, హెల్త్ ఇన్సూరెన్స్‌లు ఈ కార్యక్రమం కింద లభిస్తాయి. ప్రతీ రెండేళ్లకి ఒకసారి దీనిని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే అమెరికా పౌరసత్వం మాత్రం లభించదు. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి దీనిని వెనక్కి తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు డెమోక్రాట్లు అడ్డం పడుతూనే ఉన్నారు.
ఇది చాలా సమగ్రమైన బిల్లు. ఎంతో మంచి బిల్లు. ప్రతిభ ఆధారంగా వలస విధానం ఉంటుంది. ఇందులో డీఏసీఏని కూడా చేరుస్తున్నాం. డీఏసీఏ ద్వారా లబ్ధి పొందుతున్న వారికి అమెరికా పౌర సత్వం లభించేలా కొత్త విధానం బాటలు వేస్తుం ది. దీనిపై ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తారు’
డోనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment