
హూస్టన్: దాదాపు 6 లక్షల మంది వలసదారులను స్వదేశాలకు తరలించకుండా రక్షణ కల్పిస్తున్న డాకా(డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్) చట్టం చెల్లదని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. బరాక్ ఒబామా హయాంలో తీసుకువచ్చిన ఈ చట్టంతో ఇప్పటివరకు పలువురు భారతీయ యువతకు రక్షణ లభిస్తూ వచ్చింది. డ్రీమర్స్‌గా పిలిచే ఈ యువతకు శరాఘాతం కలిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో డ్రీమర్స్‌ను రక్షించాలన్న బైడెన్ ప్రభుత్వ యత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలనట్లయింది. ఈ చట్టం రూపొందించడంలో ఒబామా ప్రభుత్వం పరిధి దాటిందని న్యాయమూర్తి ఆండ్రూ హనెన్ అభిప్రాయపడ్డారు.
హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి ఈ చట్టాన్ని రూపొందించే అధికారాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని, ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోకుండా ఈ చట్టం అడ్డుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చట్టం అనైతికమని, అందువల్ల ఇకపై డాకా అప్లికేషన్ల ఆమోదాన్ని నిలిపివేయాలని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖను న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఇప్పటికే స్వీకరించిన అప్లికేషన్లపై తీర్పు ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు. టెక్సాస్ సహా పలు రిపబ్లికన్ రాష్ట్రాలు డాకాకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశాయి. ఈ చట్టం కారణంగా తాము అదనపు వ్యయాలు భరించాల్సివస్తోందని ఈ రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయి. తాజాగా డాకాపై తీర్పునిచ్చిన న్యాయమూర్తిని గతంలో బుష్ ప్రభుత్వం నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment