ట్రంప్ కంపు హెచ్చరిక!
వాషింగ్టన్: రిపబ్లికన్ అభ్యర్థి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో హెచ్చరికలు చేశారు. రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో తాను వరుస విజయాలు సాధించిన నేపథ్యంలో తనకు పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం ఇవ్వకపోతే.. అమెరికాలో అల్లర్లు చెలరేగుతాయని ఆయన హెచ్చరించారు.
న్యూయార్క్ చెందిన బిలియనీర్ అయిన ట్రంప్ మంగళవారం జరిగిన ఫ్లోరిడా, ఇల్లినాయిస్, నార్త్ కరోలినా ప్రైమరీల్లో ఘనవిజయం సాధించారు. దీంతో అధ్యక్ష అభ్యర్థిత్వం సాధించడానికి అవసరమైన 1,237 డెలిగేట్స్ మద్దతు దాదాపుగా ఆయనకు లభించినట్టే. అయితే, అత్యంత కీలక రాష్ట్రమైన ఓహిలో మాత్రం ట్రంప్ చిత్తుగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో నవంబర్ 8న జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్‌కు అభ్యర్థిత్వాన్ని నిరాకరించే అవకాశముందని తెలుస్తోంది. అధ్యక్ష అభ్యర్థిత్వానికి కావాల్సిన మెజారిటీని ట్రంప్ సాధించనిపక్షంలో ఆయనను కాకుండా మరొకరిని అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం రిపబ్లికన్ పార్టీకి ఉంటుంది. జూలైలో జరిగే సదస్సులో ఈ విషయమై నిర్ణయం తీసుకుంటారు.
ట్రంప్ చేస్తున్న అర్థంపర్థంలేని వ్యాఖ్యలు రిపబ్లికన్ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తున్నది. ముఖ్యంగా కోటిమంది వలసదారులను అమెరికా నుంచి వెళ్లగొడతానని, ముస్లింలు అమెరికా రాకుండా తాత్కాలికంగా నిషేధిస్తామని, మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మిస్తానని ఆయన పేర్కొన్న వ్యాఖ్యలు రిపబ్లికన్ పార్టీని ఇరకాటంలో పడేశాయి. ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ అభ్యర్థిత్వాన్ని కట్టబెడతారా? అన్నది ప్రాముఖ్యం సంతరించుకుంది. అయితే, తనకు లక్షలాది మంది ప్రజలు మద్దతు ఉందని, తనకు అభ్యర్థిత్వాన్ని కేటాయించకపోతే, పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగుతాయని సీఎన్ఎన్ చానెల్‌తో ట్రంప్ తెలిపారు.