బ్రెజిల్ జైల్లో ఘర్షణలు
60 మంది మృతి
రియోడి జనీరో: తరచూ జైళ్లలో ఘర్షణలతో నెత్తురోడే బ్రెజిల్‌లో మరో ఘోరం! అమెజానియా రాష్ట్ర రాజధాని మానౌజ్‌లో ఓ జైల్లో రెండు గ్యాంగుల మధ్య జరిగిన ఘర్షణల్లో 60 మంది ఖైదీలు మృతిచెందారు. పలువురిని తుపాకీ కాల్పులతోపాటు గొంతుకోసి, శరీరాలను ఛిద్రం చేసి చంపారు. ఆదివారం మధ్యాహ్నం మొదలైన ఘర్షణలు సోమవారం ఉదయం వరకు కొనసాగాయని ప్రజా భద్రత కార్యదర్శి సెర్గో ఫాంటెస్ చెప్పారు.
కొందరు ఖైదీలు తప్పించుకున్నారని, జైలు సిబ్బందిలో పలువురిని ఖైదీలు నిర్బంధించారని తెలిపారు. తమపై దాడులు జరక్కుండా చూడాలని డిమాండ్ చేసిన ఖైదీలు ఓ జడ్జి మధ్యవర్తిత్వంతో 12 మంది జైలు సిబ్బందిని విడుదల చేయడంతో ఘర్షణలు ముగిశాయి. జైళ్లలో పట్టుకోసం గత ఏడాది రెండు నేరగాళ్ల ముఠాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు తాజా ఘటనకు కారణమని భావిస్తున్నారు. మరోపక్క.. ఇదే రాష్ట్రంలోని మరో జైలు నుంచి సోమవారం తెల్లవారుజామున 87 మంది ఖైదీలు తప్పించుకున్నారు.