
ట్రంప్ కాన్వాయ్‌ని ఢీ కొట్టేందుకు..!!
సాక్షి, మిస్సోరి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాన్వాయ్‌ను చెట్ల పొదల్లో నుంచి దూసుకొచ్చిన ఓ కారు ఢీ కొట్టబోయింది. అమెరికాలోని మిస్సోరి పర్యటనకు ట్రంప్ వెళ్లారు. విమానాశ్రయం నుంచి కారులో వెళ్తున్న ఆయన కాన్వాయ్‌పైకి చెట్ల పొదల్లో నుంచి ఓ కారు దూసుకొచ్చింది. దీంతో ఆ కారు ట్రంప్ కారును ఢీ కొడుతుందేమోననే భయాందోళనలు వ్యక్తం అయ్యాయి.
అయితే పొదల్లో నుంచి వచ్చిన కారు రోడ్డుపైకి వచ్చి నిలిచిపోయింది. వెంటనే అలర్ట్ అయిన ట్రంప్ భద్రతా సిబ్బంది కారులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. బ్రేక్స్ ఫెయిల్ కావడం వల్లే ఇలా జరిగిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు చెప్పారు.
కానీ, కారు ట్రంప్ కాన్వాయ్ వైపు దూసుకురావడం వీడియో తీసిన ఓ యువకుడు మాత్రం విభిన్నమైన కథనాన్ని చెబుతున్నాడు. కారు కావాలనే ట్రంప్ కాన్వాయ్ వైపు వచ్చినట్లు అనిపిస్తోందని చెప్పాడు. కారులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నట్లు కనిపించిందని వెల్లడించాడు.