చాక్లెట్ లవర్స్ కి స్వీట్ న్యూస్!
వాషింగ్టన్: మీరు తరచూ చాక్లెట్లు తింటారా? అయితే మీకో స్వీట్ న్యూస్..! తరచుగా చాక్లెట్స్ తినేవారిలో మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుందట. తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు. చాక్లెట్లలో ఉపయోగించే కోకో చెట్టు గింజల రసం ఆరోగ్యానికి మేలు చేస్తుందనేది ప్రాచీనకాలం నుంచి తెలిసిన విషయమే. చాక్లెట్లు తినడం వల్ల గుండెకు కూడా మేలు చేస్తుందని పలు పరిశోధనల్లో తేలింది.
అయితే చాక్లెట్ల తినడం వల్ల మనిషి మెదడుపై, ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఇప్పటివరకు పెద్దగా తెలియదు. ఈ నేపథ్యంలో 23 నుంచి 98 ఏళ్ల వయస్సు గల 968 మంది వ్యక్తులపై దక్షిణ ఆస్ట్రేలియా యూనివర్సిటీ, అమెరికాలోని మైనీ యూనివర్సిటీ, లక్సంబర్గ్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధన జరిపారు. వీరిపై పలు పరీక్షలు నిర్వహించడం ద్వారా తరచూ చాక్లెట్ల తినే వ్యక్తుల్లో మెదడు పనితీరు కొంత మెరుగ్గా ఉందని, ముఖ్యంగా కంటిచూపు, జ్ఞాపక శక్తి, వర్కింగ్ మెమరీ వంటి సామర్థ్యాలు మెరుగ్గా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.