గాల్లోని తేమను నీటిగా మార్చే యంత్రాల గురించి మీరు ఇప్పటికే చాలాసార్లు విని ఉంటారు. ఇవి మారుమూల ప్రాంతాల్లోనూ ఎడారుల్లోనూ ప్రజల దాహార్తిని తీర్చగల సామర్థ్యం ఉన్నవి. అయితే గాల్లోని ఈ తేమను నీటిగా కాకుండా విద్యుత్తుగా మార్చవచ్చునని అంటున్నారు మసాచూసెట్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఎయిర్ జెన్ అని పిలుస్తున్న ఈ కొత్త టెక్నాలజీలో నానోస్థాయి తీగలున్న పలుచటి పొరలాంటిది ఉంటుంది. మిల్లీమీటర్‌లో పదివేల వంతులు తక్కువ సైజుండే పొరకు ఇరువైపులా రెండు ఎలక్ట్రోడ్‌లు ఏర్పాటు చేస్తారు. ఒకవైపున ఉన్న ఎలక్ట్రోడ్ పొరలో కొంతభాగం మాత్రమే ఉంటే మిగిలినది గాల్లో ఉంటుంది. మరోవైపు జియోబ్యాక్టర్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ప్రొటీన్లతో తయారైన నానో తీగలు విద్యుత్తు వాహకాలుగా పనిచేస్తాయి.
ఈ యంత్రంలోకి గాలి ప్రవేశించినప్పుడు అందులోని తేమ, నానోతీగలపై ఉండే సూక్ష్మ రంధ్రాల కారణంగా రెండు ఎలక్ట్రోడ్‌ల మధ్య కరెంటు పుడుతుంది. శాస్త్రవేత్తలు తయారు చేసిన నమూనా పరికరం ద్వారా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను పనిచేయించవచ్చునని, సహారా వంటి ఎడారి ప్రాంతాల్లోనూ ఇది సాధ్యమని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డెరెక్ లవ్లీ తెలిపారు. తాజాగా తాము ఈ–కోలీ బ్యాక్టీరియా ద్వారా మరింత ఎక్కువ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయగలిగామని, దీనిద్వారా స్మార్ట్‌ఫోన్లలోని బ్యాటరీలకు ప్రత్యామ్నాయాన్ని తయారు చేయవచ్చునని అంచనా వేస్తున్నట్లు డెరెక్ తెలిపారు. అంతిమంగా భారీసైజున్న విద్యుదుత్పత్తి పరికరాలను తయారు చేయడం తమ లక్ష్యమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment