![Wind Catching Systems Power Supply To 80thousend Houses - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/25/wind%20catching%20systems%20power%20supply.jpg.webp?itok=QkNVV5Sx)
ఫొటోలో కనిపిస్తున్నది కొత్త తరహా ఓడ కాదు, ఓ గాలిమర. పైగా ఇది నీటిలో తేలుతుంది. సాధారణంగా గాలిమరలను ఎల్తైన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. అక్కడ గాలి బాగా వీస్తుంది కాబట్టి. అయితే ఎత్తయిన ప్రాంతాల కంటే సముద్రాల మీదే గాలి బాగా వీస్తుంది. మరి ఆ గాలిని ఇప్పటి వరకు ఉపయోగించుకోకపోవడానికి కారణం.. అక్కడ వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతుండడమే. పైగా అక్కడ వీచే పెనుగాలులకు గాలిమర ఫ్యాను రెక్కలు, దానికి ఆధారంగా ఉండే స్తంభం విరిగిపోతాయి. అందుకే నార్వేకు చెందిన ఓ కంపెనీ డబ్ల్యూసీఎస్ (విండ్ క్యాచింగ్ సిస్టం) టెక్నాలజీ ఉపయోగించి దీనిని రూపొందించింది.
చతురస్రాకారంలో ఉండే ఈ నిర్మాణం వెయ్యి అడుగుల ఎత్తు ఉంటుంది. ఇందులో వందల సంఖ్యలో చిన్న చిన్న ఫ్యాన్లు అమర్చి, డివైడ్ అండ్ రూల్ పద్ధతిని అమలు చేశారు. వీటికి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. కానీ అవి ఉత్పత్తి చేసే విద్యుత్ మాత్రం ఒకే చోట నిల్వ అవుతుంది. దీనివల్ల ఏదైనా ఒక ఫ్యాను పనిచేయక పోయినా, ఇతర ఫ్యాన్లు ఉత్పత్తి చేసే విద్యుత్ ఉపయోగించుకునే వీలుంటుంది. సముద్రంలో ఏర్పాటు చేసిన ఈ గాలిమర ఒకేసారి సుమారు 80 వేల ఇళ్లకు కావల్సిన విద్యుత్‌ను సరఫరా చేయగలదు. ఇది నేల మీద ఉండే 25 గాలిమరల సామర్థ్యానికి సమానం. వీటి మన్నికా ఎక్కువే. సాధారణ గాలిమర మన్నిక 30 సంవత్సరాలు ఉంటే, సముద్రంలోని ఈ గాలిమర 50 సంవత్సరాల వరకు నిరంతరాయంగా పని చేయగలుగుతుంది. త్వరలోనే ఇలాంటి మరిన్ని గాలిమరలను సముద్రంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది డబ్ల్యూసీఎస్ కంపెనీ.
Comments
Please login to add a commentAdd a comment