పవర్‌హౌస్‌లో 2 ప్యానల్ బోర్డులు
పవర్‌హౌస్‌లో 2 ప్యానల్ బోర్డులు
Published Mon, Mar 20 2017 10:45 PM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM
రూ.39 లక్షల వ్యయంతో ఏర్పాటుకు నిర్ణయం
వేదసార రత్నావళి పుస్తకాలు పునర్‌ముద్రణ
వచ్చే నెలలో చెన్నై, దిల్లీలలో సత్యదేవుని వ్రతాలు
అన్నవరం దేవస్థానం పాలకవర్గ సమావేశంలో తీర్మానాలు
అన్నవరం : అన్నవరం దేవస్థానంలో విద్యుత్ సరఫరా మెరుగుకు, షార్ట్‌సర్క్యూట్ వంటి ప్రమాదాల నివారణకు ట్రాన్స్‌ఫార్మర్స్, జనరేటర్స్‌ను అనుసంధానం చేస్తూ రూ.39 లక్షల వ్యయంతో కొండదిగువన పవర్‌హౌస్ వద్ద రెండు ప్యానల్‌బోర్డులు ఏర్పాటు చేయాలని దేవస్థానం పాలకవర్గం నిర్ణయించింది. దేవస్థానం ఛైర్మన్ రాజా ఐవీ రోహిత్ అధ్యక్షతన సోమవారం రత్నగిరిపై జరిగిన పాలకవర్గ సమావేశంలో ఈఓ కే నాగేశ్వరరావు, ఏసీ జగన్నాథరావు, ఏఈఓలు నటరాజ్, సాయిబాబా, వైఎస్‌ఆర్ మూర్తి, పీఆర్‌ఓ తులా రాము ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వివరాలను చైర్మన్, ఈఓ విలేఖర్లకు వివరించారు.
దేవస్థానంలో విద్యుత్ రక్షణ చర్యలు, వినియోగం, చార్జీల తగ్గింపుపై చర్చ జరిగింది. గతేడాది వరకూ దేవస్థానానికి నెలకు రూ.20 లక్షల వరకూ విద్యుత్ బిల్లు వచ్చేది. అయితే విద్యుత్ పొదుపు చర్యలు చేపట్టాక ఆ బిల్లు రూ.ఎనిమిది లక్షలకు తగ్గింది. ప్రస్తుతం సత్యగిరి మీద గల పవర్‌హౌస్ వద్ద మాత్రమే ప్యానల్ బోర్డు ఉంది. దిగువన పవర్‌హౌస్‌లో ప్యానల్ బోర్డులు లేక అక్కడ తరుచూ విద్యుత్ సరఫరాలో సమస్యలు ఎదురవుతుండడంతో అక్కడా ప్యానల్ బోర్డులు ఏర్పాటు చేయాలని గత నెలలో అన్నవరం దేవస్థానానికి విచ్చేసిన దేవాదాయశాఖ విద్యుత్ కన్సెల్టెంట్ సీఎంఆర్ మోహన్‌రావు సూచించారు. ఆయన సూచనల మేరకు పవర్‌హౌస్‌లో ప్యానల్ బోర్డులు ఏర్పాటుకు తీర్మానించారు.
సమావేశంలో చర్చకు వచ్చిన ఇతర అంశాలు:
* ప్రముఖ వేదపండితుడు ఉప్పులూరి గణపతిశాస్త్రి రాసిన వేదసార రత్నావళి పుస్తకం రెండు భాగాలను పునర్‌ముద్రించి దేవస్థానంలో విక్రయించాలని తీర్మానించారు. రెండు భాగాలు కలిపి వేయి సెట్లు ముద్రించడానికి రూ.2,96,400 వ్యయమవుతుందని నిర్ణయించారు. రెండు సెట్లు కలిపి రూ.350కి విక్రయిస్తారు.
* హిందూధర్మ పరిరక్షణ ట్రస్ట్ ధర్మప్రచారంలో భాగంగా దేవాదాయశాఖ కమిషనర్ నియమించిన ఇద్దరు భజన గురువులకు ఒక్కొక్కరికీ రూ.పదివేలు చొప్పున వేతనం, రూ.ఐదువేల చొప్పున అలవెన్స్‌లు చెల్లించాలని నిర్ణయించారు.
* ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆహ్వానం మేరకు ఏప్రిల్ 14న చెన్నైలో, బాలరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆహ్వానం మేరకు ఏప్రిల్ 22, 24 తేదీలలో ఢిల్లీలో సామూహిక సత్యదేవుని వ్రతాల నిర్వహణకు పురోహితులను, పూజాసామగ్రిని పంపించాలని తీర్మానించారు.
* ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకూ రత్నగిరిపై భక్తులకు మజ్జిగ పంపిణీ చేయాలని తీర్మానించారు.
Advertisement
Advertisement