పైలట్ చివర్లో ఆ విషయం చెప్పారు
దుబాయ్: తిరువనంతపురం-దుబాయ్ ఎమిరేట్స్ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో 300 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.. బుధవారం దుబాయ్ విమానాశ్రయంలో ఈ విమానం క్రాష్ ల్యాండ్ అయిన దృశ్యాలు చూస్తే ఎంతపెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారో తెలుస్తుంది.. విమానం నుంచి దట్టంగా పొగలు వస్తుండగా అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అయితే ప్రమాదంలో చిక్కుకున్నారన్న విషయం విమాన ప్రయాణికులకు చివరకు వరకు తెలియదట. విమానం క్రాష్ ల్యాండ్ కావడానికి కొన్ని నిమిషాల ముందు పైలట్ ఈ విషయం చెప్పారని ప్రయాణికులు చెప్పారు.
విమానం దుబాయ్ దగ్గరకు చేరుకుందని, ల్యాండింగ్ గేర్లో సమస్య వచ్చిందని, దీంతో అత్యవసర ల్యాండింగ్ చేస్తున్నట్టు పైలట్ ప్రకటించారని ప్రయాణికులు తెలిపారు. కొన్ని నిమిషాల తర్వాత విమానం ల్యాండ్ అయిందని చెప్పారు. వెంటనే విమానం ఎమర్జెన్సీ డోర్లు అన్నీ తెరిచి నిమిషాల్లో ప్రయాణికులను సురక్షితంగా బయటకుపంపారని తెలిపారు. విమానంలో 282 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది ఉండగా, వీరిలో 226 మంది భారతీయులు ఉన్నారు.