
రెండు రోజుల క్రితం ఎమిరేట్స్ విమానయాన సంస్థ పోస్ట్ చేసిన ఓ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ ఫోటో చూసిన దగ్గర నుంచి నెటిజన్లలో ఒకటే అనుమానం.. ‘ఇది నిజమేనా’.. ‘ఇంత ఖరీదైన విమానమా’.. ‘ఎంత ఖర్చు చేశారు’ అనే ప్రశ్నలు క్యూ కట్టాయి. ఇంతలా ఆకర్షించడానికి ఏముందా ఫోటోలో అని ఆలోచిస్తున్నారా.. ఎందుకంటే ఆ విమానం వేల వజ్రాల కాంతితో మిరిమిట్లుగొలుపుతోంది. దాంతో చూసిన వారికి ఇది వజ్రాలు పొదిగిన విమానమేమో అనే అనుమానం వచ్చింది. కానీ ఇది నిజంగా వజ్రాలు పొదిగిన విమానం కాదు. కేవలం ఫోటో మాత్రమే. ఈ విషయాన్ని ఎమిరేట్స్ సంస్థనే ప్రకటించింది.
Presenting the Emirates ‘Bling’ 777. Image created by Sara Shakeel 💎💎💎 pic.twitter.com/zDYnUZtIOS
— Emirates Airline (@emirates) December 4, 2018
విమానం ఫోటోను పోస్ట్ చేస్తూ ‘‘బ్లింగ్’ 777 ఇమేజ్ క్రియేటెడ్ బై సారా షకీల్’ అంటూ ఎమిరేట్స్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అంటే ఇది కేవలం ఫోటో మాత్రమే అని ఎమిరేట్సే స్వయంగా ప్రకటించింది. అయితే నెటిజన్లు అంతా ఫోటోను మాత్రమే చూశారు. పక్కనే ఉన్న క్యాప్షన్‌ని చూడకపోవడంతో ఈ అనుమానాలు బయలు దేరాయి. చివరకు ఎమిరేట్స్ అధికారి ఒకరు ఇది సారా షకీల్ రూపొందించిన చిత్రం అంటూ వివరణ ఇచ్చారు. ‘ఆమె సృష్టించిన ఈ కళాఖండాన్ని మాత్రమే మేం పోస్టు చేశాం. ఇది నిజం కాదు’ అంటూ సదరు అధికారి మీడియాకు స్పష్టం చేశారు.
ప్రముఖ క్రిస్టల్ ఆర్టిస్ట్ అయిన సారా షకీల్.. ఈ అద్భుత చిత్రాన్ని రూపొందించి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అది కాస్తా ఎమిరేట్స్ సంస్థను ఆకర్షించింది. వెంటనే వారు ఆమె అనుమతితో ఈ ఫొటోను రీపోస్టు చేశారు.