
ఉగ్రవాదుల చెరకు బాలికగా వెళ్లి తల్లిగా విముక్తి
నైజీరియా: సరిగ్గా రెండేళ్ల కిందట పాఠశాల నుంచి బొకోహారమ్ ఉగ్రవాదులు ఎత్తుకుపోయిన 273మంది బాలికల్లో ఓ బాలిక తప్పించుకొని వచ్చింది. ప్రస్తుతం 19 ఏళ్ల యువతిగా మారిన ఆ బాలిక ఓ చంటి బిడ్డతో తిరిగొచ్చింది. ఉగ్రవాదులను అణిచివేసేందుకు నైజిరీయా సైన్యం నిర్వహిస్తున్న ఆపరేషన్ లో భాగంగా ఈ యువతికి విముక్తి లభించింది. ఆమె ఈ రోజు అధ్యక్షుడు ముహమ్మద్ బుహారిని కలవనుంది. రెండేళ్ల కిందట నైజిరీయాలోని చిబోక్ అనే గ్రామంపై అనూహ్యంగా భారీ మొత్తంలో సాయుధులుగా వచ్చిన ఉగ్రవాదులు దాదాపు 273మంది బాలికలను ఓ పాఠశాల నుంచి ఎత్తుకెళ్లారు.
వారంతా యుక్త వయసుకు వచ్చినవారే. అలా తీసుకెళ్లిన వారిని బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చడం, రకరకాల పనులకు ఉపయోగించడం, బలవంతపు పెళ్లిల్లు చేసుకోవడం ఇలాంటివి ఎన్నో చేశారు. ఈ క్రమంలోనే అమినా అలి దర్శా కెకి అనే యువతిని కూడా అందులో ఓ ఉగ్రవాది బలవంతపు వివాహం చేసుకున్నాడు. ఆమెను గర్భవతిని చేసి వదిలిపెట్టాడు. ఈ మధ్యకాలంలోనే ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ పాపనే ఎత్తుకుని సాంబిసా అడవిలో తిరుగుతూ నైజీరియా బలగాలకు తారసపడటంతో ఆమెను సురక్షితంగా హెలికాప్టర్ ద్వారా తరలించి వైద్యం చేయించారు.