గాలి కోసం పారిపోయాడు.. మాట కోసం తిరిగొచ్చాడు
జెనీవా: నా రూటే సెపరేటు అంటూ చాలా మంది డైలాగులు చెపుతుంటారు. కానీ తాను చాలా డిఫరెంట్ అని నిరూపించాడో ఫ్రెంచ్ ఖైదీ. ఖైదీ జీవితం బోర్ కొట్టి కాస్త చల్ల గాలికి తిరిగి రావడం కోసం జైలు నుంచి పరారయ్యాడు. అయితే ఓ వారం తర్వాత మళ్లీ బుద్ధిగా జైలుకు వచ్చేశాడు. ఫ్రాన్స్‌కు చెందిన 38 ఏళ్ల వ్యక్తికి వేశ్యను హత్య చేసిన కేసులో స్విట్జర్లాండ్ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో అతడు జెనీవాలోని సెమీ ఓపెన్ జైలులో కొన్నేళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్నాడు. కొద్ది రోజులుగా అతనికి జైలు జీవితం బోర్ కొట్టింది. స్వేచ్ఛ, చల్లగాలి కావాలనిపించింది.
అంతే గత ఆదివారం ఒక ఉత్తరం రాసి పెట్టి జైలు నుంచి పరారయ్యాడు. తల్లి పేరిట రాసిన ఆ ఉత్తరంలో ఏం రాశాడంటే.. నాలుగైదు రోజులు ఎంజాయ్ చేసి తిరిగి మళ్లీ జైలుకు వచ్చేస్తారంటూ మాటిచ్చాడు. జైలు నుంచి ఖైదీ పరారైతే అధికారులు ఊరుకుంటారా.. అంతర్జాతీయ స్థాయిలో వేట మొదలుపెట్టినా అతని ఆచూకీ లభించలేదు. కానీ ఇచ్చిన మాట ప్రకారం అతను గురువారం అర్ధరాత్రి తిరిగి స్విస్ జైలుకు వచ్చేశాడు.