ఇథియోపియాలో 400 మంది హత్య
అడిస్ అబాబా: ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన 400 మందిని ఇథియోపియా ప్రభుత్వం హతమార్చిందని ఇంగ్లండ్‌కు చెందిన మానవహక్కుల పరిశీలన సంస్థ ప్రకటించింది. గత ఏడాది నవంబరు నుంచి ఈ హత్యలు జరిగాయని గురువారం తెలిపింది. ఒరోమియా ప్రాంతంలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వేలాది మంది ఆందోళనకారులను అరెస్టు చేశారని పేర్కొంది.
రాజధాని విస్తరణ కోసం సాగు భూమిని ఉపయోగించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆందోళనకారులపై ఇథియోపియా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించిందని, అరెస్టయిన వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేసిందని తెలిపింది. ఇథియోపియా ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది.