లండన్ : రోజూ వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తుండటంతో బిజీ రోడ్లపై ఓ అరగంట నడిచేసి మొక్కుబడిగా ముగిస్తే మొదటికే మోసం వస్తుందని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. ట్రాఫిక్ అధికంగా ఉండే రోడ్లపై వాకింగ్, జాగింగ్ చేస్తే కాలుష్య ప్రభావంతో వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని హెచ్చరించింది. డీజిల్ వాహనాలు, వ్యర్థ పదార్ధాలు వెదజల్లే వాయువులతో మనం పీల్చే గాలిలో ప్రమాదకర స్ధాయిలో పర్టిక్యులేట్ మేటర్ (పీఎం) స్ధాయిలు పెరుగుతాయని, ఉదయాన్నే బిజీబిజీ వీధుల్లో వాకింగ్‌కు బయలుదేరితే ప్రతికూల ఫలితాలే అధికమని దక్షిణ కొరియా నిపుణులు చేపట్టిన అథ్యయనం స్పష్టం చేసింది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే వీధుల్లో వాకింగ్ చేసేవారిలో వెంట్రుకల పెరుగుదలకు అవసరమైన ప్రొటీన్ల స్ధాయి తగ్గినట్టు ఈ అథ్యయనంలో పరిశోధకులు గుర్తించారు.
కాలుష్యంతో సహజీవనం ద్వారా ఆస్త్మా, క్రానిక్ బ్రాంకైటీస్, గుండె జబ్బులు, స్ట్రోక్, డిమెన్షియా వంటి వ్యాధుల ముప్పు అధికమని యూనివర్సిటీ ఆఫ్ ఎసెక్స్ కాలుష్య నిపుణులు ప్రొఫెసర్ ఇయాన్ కాల్బెక్ విశ్లేషించారు. కాగా, ఈ నివేదికను మాడ్రిడ్‌లో జరిగిన యూరోపియన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ, వెనెరాలజీ కాంగ్రెస్‌లో సమర్పించారు. వాహన రాకపోకలతో బిజీగా ఉండే రోడ్లపై వాకింగ్, వ్యాయామానికి పూనుకోవడం కంటే ఇంటి పరిసరాల్లో లేదా ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేయడం సరైనదని వారు పేర్కొన్నారు. ఇక ఏంజైనా సహా గుండె జబ్బులతో బాధపడేవారు సైతం కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో ఆరుబయట వ్యాయామం చేయడం సరైంది కాదని సూచించారు. కాలుష్య స్ధాయిలు అధికంగా ఉన్న సమయంలో నివాస ప్రాంగణాలు, ఇంటి సమీపంలోని పార్క్‌ల్లో వ్యాయామం చేయడం మేలని నిపుణులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment