చీటింగ్ చేస్తున్న ఫేస్‌బుక్!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఛీటింగ్ చేస్తుందా? తనకు గిట్టని సంప్రదాయవాద రాజకీయ కథనాలను 'ట్రెండింగ్' జాబితా నుంచి అర్ధంతరంగా తొలగిస్తున్నదా? అంటే టెక్నాలజీ న్యూస్ వెబ్‌సైట్ 'గిజ్మోడో' ఔననే అంటున్నది.
సంప్రదాయవాద పాఠకులకు ఆసక్తి కలిగించే వార్తలు 'ట్రెండింగ్' జాబితాలో కనిపించకుండా.. ఫేస్‌బుక్ ఉద్యోగులు నిత్యం తోసి అవతలకు పారేస్తారని ఆ సైట్ మాజీ ఉద్యోగి ఒకరు గిజ్మోడోకు తెలిపాడు. అదేసమయంలో ట్రెండింగ్ లిస్ట్‌లోకి ఇతర కథనాలను 'కృత్రిమంగా' చేరుస్తారని వెల్లడించాడు. ఈ కథనంతో ఫేస్‌బుక్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ పక్షపాతంతో ఫేస్‌బుక్ వ్యవహరిస్తున్నదని, ఆ సైట్‌లో 'ట్రెండింగ్ లిస్ట్' నిర్వహణలో పారదర్శకత లేదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కథనంపై ఫేస్‌బుక్ స్పందిస్తూ.. తటస్థత పాటించే విషయంలో తమ వెబ్‌సైట్ కచ్చితమైన, కఠినమైన మార్గదర్శకాలను అనుసరిస్తున్నదని మీడియాకు వివరణ ఇచ్చింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ట్రెండింగ్ టాపిక్స్‌లో కనిపించకుండా ఏ మీడియా సంస్థను నిషేధించడం కుదరదని తెలిపింది. 'రాజకీయ అభిప్రాయాలను తొక్కివేసేందుకు మా మార్గదర్శకాలు ఎంతమాత్రం అనుమతించవు. అదేవిధంగా ఏదైనా రాజకీయ అభిప్రాయంగానీ, మీడియా సంస్థగానీ ఒకదాని కన్నా మరొకటి అధిక ప్రాధాన్యం పొందేందుకు వీలు కల్పించవు' అని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. కాగా, 'ఇది అతివాద భావజాలానికి ఆజ్యం పోయడమే కాకుండా సోషల్ సమాచార నియంత్రణకు సిలికాన్ వ్యాలీ ప్రయత్నిస్తున్నట్టు ప్రమాదకర సంకేతాలు ఇస్తోంది' అని ప్రముఖ జర్నలిస్టు గ్లెన్ గ్రీన్‌వాల్డ్.. ఫేస్‌బుక్‌పై మండిపడ్డారు.