ఫేస్ ‘బుక్’ అవుతుంది.. జాగ్రత్త...! | Beware with face book | Sakshi
Sakshi News home page

ఫేస్ ‘బుక్’ అవుతుంది.. జాగ్రత్త...!

Published Mon, Sep 8 2014 1:54 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ఫేస్ ‘బుక్’ అవుతుంది.. జాగ్రత్త...! - Sakshi

ఫేస్ ‘బుక్’ అవుతుంది.. జాగ్రత్త...!

చైన్ లింక్‌లా పెరిగే స్నేహాలు
 నేటి యూత్‌లో ప్రస్తుతం సూపర్ ట్రెండ్‌గా ఫేస్‌బుక్ కొనసాగుతోంది. ఒకప్పుడు ముఖ పరిచయం తర్వాత ఎన్నో రోజులు మాట్లాడుకొని ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకున్నాక తర్వాతే స్నేహం చిగురించేది. అయితే మారుతున్న ఆధునికతకు తోడు స్నేహాలను కూడా వేగంగా పెంచుకోవడం స్టైల్ అయింది. దీనిలో ఇంటర్‌నెట్ సౌజన్యంతో వాడే ఫేస్‌బుక్‌దే ప్రథమ స్థానం.

చైన్ లింక్‌లా పెరిగిపోయే పరిచయస్తులందరకీ విద్య, సినిమాలు, రాజకీయాలు, సరదా కబుర్లు, జన్మదిన, వివాహ శుభాకాంక్షలు, విషాద సంఘటనలు, సామాజిక చైతన్యం తీసుకువచ్చే ప్రకటనల వంటివి సులభంగా షేర్ చేసుకొనే అవకాశం కలుగుతుంది. అందుకే ఫేస్‌బుక్‌కు ఇంత డిమాండ్ ఏర్పడింది. ఒక్కసారి ఫేస్‌బుక్‌లో లాగిన్ అయి ఏదో ఒకటి కామెంట్ పోస్టు చేస్తూ ఎంజాయ్ చేసేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.
 
 తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి
 చదువుకు సంబంధించిన సమాచారం, కరెంట్ అఫైర్స్, సైన్స్ ఫిక్షన్ వంటివి తెలుసుకొనేందుకు ఫేస్‌బుక్ ఉపయోగిస్తే మంచిదే కానీ.. దానిని అనవసరమైన సమాచారం కోసం ఉపయోగించడం అనర్థాలకు దారి తీస్తుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు కావాలని మారాం చేసినా.. ఎక్కువ సేపు వినియోగిస్తున్నా తల్లిదండ్రులు గుర్తించాలి. ఇంటర్‌నెట్‌ను అనవసరంగా ఉపయోగిస్తుంటే అడ్డుకోవాలి.
 
 లైక్‌లు లేకుంటే ఏమీ!
 ఔత్సాహికులు ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేయగానే తెలిసినవారందరికీ పోస్టులు చేస్తారు. ఇష్టమైన సమాచారాన్ని అంతా క్రోడీకరిస్తారు. అయితే ఎన్ని పోస్టులు చేసినా ఎవరూ లైక్ కొట్టడంలేదని కుంగిపోతారు. ఎక్కువ లైక్‌లు ఇస్తే అంత పాపులర్ అయినట్లుగా భావిస్తారు. కానీ ఈ ఆలోచన పక్కన పెట్టండి. దాని వల్ల కలిగే అదనపు ప్రయోజనం ఉండదు. మీ ఫ్రెండ్స్ సర్కిల్‌కే పరిమితం అవ్వండి.
 
 ఇలా ఉపయోగిస్తే చాలు..
మీ భావాలు స్నేహితులతో పంచుకుంటే చాలు. ప్రపంచ సమాచార వేదికపై అప్‌డేట్‌గా ఉండండి. కామెంట్లు, ఫొటోలు పోస్టు చేసేముందు ఒక్కసారి సరిచూసుకోండి.

 కొత్త, మంచి విషయాలను తెలుసుకొని వాటిని ఇతరులకు తెలియజేస్తే బాగుంటుంది. ఫొటో, కామెంట్ పోస్టింగ్‌లు నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి.

ఉద్యోగ, వ్యాపార అభివృద్ధికి ఫేస్‌బుక్ వారధిలా ఉంటుంది. చెత్త సమాచారాన్ని పంపించవద్దు. భాషను ఇష్టం వచ్చినట్లు వాడవద్దు. ఎక్కువ ఫొటోలు చూసి.. కామెంట్లు చదివే ఓపిక ఎవరికీ ఉండదని గ్రహించండి.
 
 
 ఇవి చేయవద్దు

అందరికీ తెలిసేలా ఫోన్ నంబర్లు.. వివరాలు..చిరునామాలు పోస్టు చేయకూడదు. ఫొటోలు కూడా అకౌంట్‌లో పెట్టకూడదు.

తాము పని చేస్తున్న కార్యాలయం.. ఉద్యోగ వివరాల్లో గోప్యత పాటించాలి. ఆ వివరాలు ఎవరికీ చెప్పవద్దు.

ఒకప్పటి ప్రేమలు, పెళ్లిళ్ల వివరాలపై వ్యాఖ్యలు చేయడం సరికాదు. పోస్ట్‌లు.. కామెంట్లపై తీవ్రంగా స్పందించడం..సవాల్ విసరడం వంటివి చేయొద్దు.

స్నేహితుల ఫొటోలు వారి అనుమతి లేకుండా పోస్ట్ చేయడం మంచిది కాదు. మనసు బాధగా ఉంటే ఫేస్ బుక్ జోలికి వెళ్లవద్దు.

వ్యంగ్య చిత్రాలు పెట్టడం...మరొకరిని కించపరిచేలా ఫొటోలు మార్ఫింగ్ చేయడం తప్పు.

ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తితో ఆర్థిక లావాదేవీలు జరపడం, వినోదాలకు పిలిస్తే వెళ్లడం వంటివి చేయవద్దు.

రెచ్చగొట్టే.. అవమానపరిచే ఫొటోలకు లైక్‌లు కొట్టడం చిక్కుల్లో పడేందుకేనని గుర్తుంచుకోవాలి.

 బినామీ అకౌంట్లతో భద్రం..
 కొంతమంది బినామీ పేర్లతో ఫేస్‌బుక్‌లో అకౌంట్లు ఓపెన్ చేస్తారు. ఎదుటివారిని వెంటనే ఆకర్షించేందుకు అకౌంట్‌కు అమ్మాయిల పేర్లు ఫొటోలు ఉపయోగిస్తుంటారు. ఇలా రిక్వెస్ట్‌లతో ఫ్రెండ్‌షిప్‌లు పెంచుకొని చాటింగ్ చేస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధుల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంటారు. అంతేకాదు ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇతరులకు పంపిస్తారు. పంపించేవారివి బినామీ అకౌంట్లివ్వడం వల్ల వారికేం ఇబ్బంది కలగదు. కానీ వాటిని షేర్ చేసుకొని ఇతరులకు పోస్టు చేస్తే వారే ప్రమాదాల్లో పడతారు. పోలీసు కేసులు నమోైదె న తర్వాత ఎంక్వైరీలో గుర్తిస్తే ఇబ్బందులు తప్పవని గ్రహించాలి.
 
 స్త్రీలు అప్రమత్తంగా ఉండాలి
 సాంకేతిక విప్లవాన్ని ఉపయోగించుకోవడంలో మహిళలూ ముందుండటం శుభపరిణామమే. కానీ ఫేస్‌బుక్‌కు అంకితం కావడం ప్రమాదకరం. పగలు, రాత్రి తేడా లేకుండా సెల్‌ఫోన్, కంప్యూటర్ ముందు కూర్చొని పోస్టులు, లైక్‌లు, కామెంట్లు, షేర్లతో కాలం గడిపేస్తున్నారు. అయితే మహిళలు, విద్యార్థినులు అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌లో స్నేహం చేయడం ప్రమాదకరం. సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తమ వ్యక్తిగత జీవి తాన్ని అందరికీ తెలిసేలా పోస్టు చేయడం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది.
 
 సెట్టింగ్స్ తప్పనిసరి
 ఫేస్‌బుక్ నుంచి ప్రమాదంలోకి పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మేలు. విలువైన వ్యక్తిగత సమాచారం ఫేస్‌బుక్‌లో పెట్టకపోవడం ఉత్తమం. మనం పోస్టు చేసే చిత్రాలు, కామెంట్స్‌ని మన సమీపంలోని వారే చూసేలా సెట్టింగ్స్‌ని మార్చుకోవచ్చు. వచ్చిన ప్రతి ఫ్రెండ్  రిక్వెస్ట్‌కు ఓకే చెప్పకూడదు. తెలిసినావారా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement