సోషల్‌ మీడియా ‘బతుకులు’ | Special Story On World Social Media Day | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 30 2018 12:44 PM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Special Story On World Social Media Day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశాల మధ్య సరిహద్దులు, కంచెలు ఉంటాయి. కానీ, ఇక్కడ అలాంటివేవీ ఉండవు. ఖండాంతరాలు పరుచుకున్న క్లాస్‌ అండ్‌ మాస్‌ హబ్‌ ఇది. అల్లంత దూరాలను కూడా అరచేతిలో చూపే మంత్ర నేత్రం. అనంత విశ్వాన్ని తనలో ఇముడ్చుకుని మానవాళి తప్పించుకోని విధంగా ‘వల’పన్నింది. ఆ అద్భుత మాధ్యమమే ‘సోషల్‌ మీడియా’.. స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్‌బుక్, వాట్సప్, లింక్డిన్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌(ఇంకా ఎన్నో...) అంటూ.. సగటు మనిషి జీవితం సోషల్‌ మీడియాతో పెనవేసుకుపోయింది. మనుషులేకాదు.. వ్యాపారసంస్థలు, సినిమాలు, రాజకీయ పార్టీలు.. ఇలా అన్నీ బాగా కనెక్టయ్యాయి. ఇవాళ అంతర్జాతీయ సోషల్‌ మీడియా దినోత్సవం. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక కథనం...  

సోషల్‌ మీడియా పుట్టిందిలా...‘సోషల్‌ నెట్‌ వర్కింగ్‌’(సామాజిక మాధ్యమం) అనే పదాన్ని మొట్టమొదటిసారిగా అమెరికాలోని కేంబ్రిడ్జి యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్‌ జె.ఎ. బార్నెస్‌ 1950వ సంవత్సరంలో ఉపయోగించారు. కుటుంబం, వృత్తి, అభిరుచులు, అలవాట్ల ప్రాతిపదికగా ఏర్పడే ప్రజాబృందాలనే సోషల్‌ నెట్‌వర్క్‌గా బార్నెస్‌ నిర్వచించారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌ ఆధారంగా లభించే ఆన్‌లైన్‌ వేదికను సోషల్‌ నెట్‌వర్కింగ్‌ అంటున్నారు.

మన దేశంలో... అతి తక్కువ కాలంలోనే మన దేశంలోకి ఇది ప్రవేశించింది. ఇంటర్నెట్‌ వాడకం తర్వాత అగ్ర దేశాలతోపాటు సమానంగా మనకు కూడా ఇది చేరువయ్యింది. ముఖ్యంగా యువతలో అమితమైన ఆదరణ లభించింది. సోషల్‌ మీడియా వృద్ధికి ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు దోహదం చేశాయి. నీల్సన్‌ నివేదిక ప్రకారం ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్‌, టాబ్లెట్‌లను వాడుతున్నారు. వాటికున్న అధిక కనెక్టివిటీ కారణంగా వినియోగదారులకు ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా, ఎలా కావాలన్నా సోషల్‌ మీడియా వాడుకునే స్వేచ్ఛ లభించింది.

అన్నీ ఇక్కడే... సామాజిక మాద్యమాల ప్రభావంతో వార్తా పత్రికలు చదవటం, న్యూస్‌ చానళ్లు చూడటం, బాగా తగ్గిపోయినట్లు ఓ అధ్యయనం తేల్చింది. ఒకప్పుడు ఫోటోలు షేర్‌ చేయడం, చాటింగ్‌ చేయడం వరకే పరిమితమైన సోషల్‌ మీడియా.. ప్రస్తుతం రోజువారీ అప్‌డేట్లను అందిస్తున్నాయి. తాజా వార్తలు, సినిమా ప్రమోషన్లు, రాజకీయాలు, క్రీడ వార్తలు, బిజినెస్‌ ప్రమోషన్లు, ఇలా అన్నిరకాల విశేషాల కోసం ఎక్కువగా సోషల్‌మీడియా సైట్ల వాడకం విపరీతంగా పెరిగిందని తాజా పరిశోధనలో వెల్లడైంది. అంతేకాదు పేమెంట్ల దిశగా కూడా ఈ మధ్య కొన్ని మాధ్యమాలు అడుగులు వేశాయి కూడా.

రాజకీయాల్లో... ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు సోషల్ మీడియానే ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు ఈ మీడియానే ఎక్కవగా నమ్ముకున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బీజేపీ, టీడీపీ, తెరాస, వైఎస్సార్‌సీపీలకు ప్రత్యేక వ్యవస్థలే ఉన్నాయి. పత్రికలు, టీవిల్లో అడ్వర్టైజ్‌మెంట్ల కంటే ఈ మీడియా ద్వారానే విస్తృతంగా, ఉచితంగా ప్రచారం చేసుకోవచ్చుననే ఒక అంచనాకు అన్ని రాజకీయ పార్టీలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో సోషల్‌మీడియా అతి పెద్ద ప్రచారాస్త్రంగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

పబ్లిసిటీ ఫ్రీ..: డిజైనర్‌ షోరూంలు సోషల్‌ మీడియాను ఉపయోగించుకుని గతంలో ఎన్నడూ లేని స్థాయిలో తమ బిజినెస్‌ను రెట్టింపు చేసుకుంటున్నాయి. ప్రొడక్ట్‌యాడ్స్‌తో పాటు సందేశాత్మక వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ వ్యూయర్స్‌ మనసు గెలుచుకుంటున్నారు. ఫేస్‌బుక్‌లో తమ ప్రొడక్ట్‌ గురించి ప్రతిరోజూ చర్చలు జరిగేలా జాగ్రత్తపడుతూ తేలికగా కొనుగోలుదార్లకు చేరువ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీ కూడా టీవీ మాధ్యమాల కంటే సోషల్‌ మీడియానే ఎక్కువగా నమ్ముకుంటోంది. సినీ సెలబ్రిటీలు స్వయంగా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్‌ కావటం, వాళ్ల సినిమా ప్రమోషన్లను ఇందులోనే కానిచ్చేస్తున్నారు.

భవితవ్యం.. ఇంటర్నెట్ వినియోగం సామాజిక, ఆర్థిక రంగాలలో వివిధ వర్గాల ప్రజలకు అవసరమైన, లోతైన సమాచారాన్ని అందజేయడం ద్వారా అనేక రూపాల్లో ప్రభావం చూపనుంది. అలాగే కళలు, వ్యాపారాలు, వాణిజ్య రంగాలను రూపుదిద్దడంలో, అణగారిన వర్గాలను సాధికారత పరచడంలో, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. అదే సమయంలో తప్పుడు సమాచారం పుకార్లు చేయడం ద్వారా అయోమయం, అరాచకాలకు కూడా దారి తీస్తుంది. సోషల్‌మీడియాకు కూడా రెండు వైపుల పదునుంది. అవి సానుకూల–ప్రతికూల, మంచి–చెడు, సృష్టించడం–ధ్వంసం చేయడం వంటివి.

టీవీ, పత్రికలకు గడ్డుకాలమేనా?... సోషల్‌మీడియా విస్తృతి రోజు రోజుకి పెరగడంతో రానున్నకాలంలో టీవీ, పత్రికలు గడ్డు కాలాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని గమనించిన వార్తా, మీడియా సంస్థలు పాఠకులు, ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ–పేపర్‌లు, యూట్యూబ్‌ను ఛానెల్స్‌ను ప్రారంభించాయి. టీవీ కార్యక్రమాలను లైవ్‌ ఇవ్వడం, పేపర్‌ను ఆన్‌లైన్‌ లో పెట్టడం వల్ల మరింత మంది ఆన్‌లైన్‌ వినియోగదారులను సొంతం చేసుకుంటున్నాయి. న్యూస్‌ క్షణాల్లో వారి చేతిలోకి చేరిపోవడం వల్ల ప్రజలు పత్రికలు, టీవీలు చూడడానికి ఇష్టపడటంలేదు. ఇందుకోసం పత్రికలు, టీవీలు ప్రతేక్య చర్యలు చేపట్టాయి.

యువతపై ప్రభావం: స్నేహితులతో, బంధువులతో నిత్యం టచ్‌లో ఉండేందుకు యువత ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ వంటి వాటిని విరివిగా వినియోగిస్తోంది. రాను రాను వ్యక్తిగత వ్యసనంగా మారిపోతోంది. ఇంటర్నెట్ వచ్చాక చాలామంది కమ్యూనికేషన్‌ అంటే కేవలం ఎస్‌ఎంఎస్‌లు, మెసేజ్‌లు అనేస్థాయికి వచ్చేసింది. దీనివల్ల ముఖ్యంగా ముఖాముఖిగా ఎవరూ మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఒకరితో ఒకరు మాట్లాడటమనేది ఎప్పుడో మర్చిపోయారు. అయితే వీడియో కాల్స్‌ అన్నవి మాత్రం మినహాయింపనే చెప్పుకోవచ్చు.

ఫేక్‌ ఐడీలు- ప్రమాదాలు.. సోషల్‌ మీడియాలో తప్పుడు పుట్టిన తేదీలను సృష్టించి ఫేక్‌ ఐడీలను క్రియేట్  చేస్తున్నవారు ఎక్కువవుతున్నారు. వేరే పేర్లతో ఎదుటి వారి మొహం చూడకుండానే చాటింగ్‌ చేస్తున్నారు. ఇంకా రెండు కంటే ఎక్కువ ఖాతాలు కలిగి ఉంటే ఆందోళన, మానసిక రుగ్మత వచ్చే అవకాశాలు మూడున్నర రెట్లు అధికంగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్‌ పిట్స్‌ బర్గ్‌ సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

క్లాస్‌ రూంలో ఫేస్‌‘బుక్‌’..: విద్యార్థులు సామాజిక మాద్యామాల సైట్లను ఉపయోగిస్తున్న తీరుపై టాటా కన్సల్టెన్సీ(టీసీఎస్‌) జెన్‌వై సంస్థ సంయుక్తంగా సర్వే నిర్వహించింది. 14 నగరాల్లో చేపట్టిన ఈ సర్వేలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్కూల్‌ అసైన్‌మెంట్లు పూర్తి చేయడానికి ముంబై నగరంలో అత్యధికంగా 52.9% విద్యార్థులు సోషల్‌ మీడియాపై పైన ఆధారపడుతుండగా, హైదరాబాద్‌(52%), ఇండోర్‌ (51.7%), డిల్లీ(51.1%)లు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 8నుంచి 12వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న 12,365 విద్యార్థులను ఈ సర్వేలో సంప్రదించారు. 

సోషల్‌ మీడియా అడిక్షన్‌- చికిత్స : సోషల్‌మీడియాలో అతిగా ఆధారపడటం, అది లేకుంటే ఉండలేకపోవటం వ్యసనమే. అవసరానికి మించి ఎక్కువసేపు ఉపయోగించే వారికి ఓ అలవాటుగా మారిపోతోంది. అయితే మిగతా దేశాల సంగతి పక్కనపెడితే అలాంటివారి కోసం చైనా ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. సోషల్‌మీడియా బానిసలకు ఆసుపత్రుల్లోని మానసిక చికిత్సా విభాగాల్లో ప్రత్యేక వార్డులను ప్రారంభించాలని నిర్ణయించింది. చైనాలో సుమారు నలభై లక్షల మంది రోజుకు సగటున ఆరు గంటలకు పైబడే సోషల్‌మీడియాతో కాలక్షేపం చేస్తున్నారని, వీరిలో ఎక్కువ ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలుగా మారారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement