తెలుగోడి చైతన్యానికి వేదికగా ‘సాక్షి’
* వరుస కథనాలపై వాట్సప్,ఫేస్‌బుక్‌లో చర్చలు
* తెలుగువారంతా ఏకమయ్యే సందర్భమిదేనంటూ పిలుపులు
* ఓట్లు చీలకుండా తెలుగువారిని సంఘటితపర్చేందుకు పలు సంఘాల ప్రయత్నాలు
ముంబై, న్యూస్‌లైన్: రాజకీయ దిగ్గజాల వారసత్వాన్ని పుణికిపుచ్చుకునేందుకు తెలుగు ప్రజలు సంసిద్ధులయ్యారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో నేతల గెలుపునకు కీలకశక్తిగా మారనున్నారు. ఇప్పటికే అన్ని రాజకీయపార్టీల ముఖ్య నేతలు తెలుగు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు క్యూలు కడుతోన్న నేపథ్యంలో... ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమవుతోన్న వరుస కథనాలు మరింత చైతన్యాన్ని కలిగిస్తున్నాయి. కోల్పోయిన రాజకీయ అస్థిత్వాన్ని పునరుత్తేజం కలిగించేందుకు దోహదపడుతోన్నాయి.
ప్రధానంగా ‘మరాఠి గడ్డపై తెలుగు బిడ్డ’ శీర్షికతో వచ్చిన కథనాలు అనేక మంది తెలుగు ప్రజలను కదిలించేలా చేశాయి. ఈనెల 12న ‘మసకబారిన తెలుగు’, 13న ‘తెలుగోడి దయకోసం..’ శీర్షికల పేరిట ప్రచురితమైన కథనాలపై తెలుగు నెటిజన్‌లు ఆసక్తి కనబరిచారు. సామాజిక వెబ్‌సైట్‌లలో తెలుగు ప్రజల రాజకీయవారసత్వంపై చర్చించుకుంటున్నారు. ప్రస్తుత ఎన్నికలు, రాజకీయాలు, ఓటింగ్ ప్రభావం తదితర అంశాలపై ‘వాట్సప్’లతోపాటు ఇతర సోషల్‌మీడియాలలో కొనసాగుతోన్న చర్చల్లో ‘సాక్షి’ కథనాల ప్రాధాన్యత కనిపిస్తోంది.
రాష్ట్ర రాజకీయాల్లో నాడు చక్రం తిప్పిన సీనియర్‌లను గుర్తుచేస్తూ.. ఆనాటి తెలుగు ప్రజల రాజకీయ వైభవాన్ని మరలా సాధించుకోవాలనే స్ఫూర్తితో ఓటర్లు సిద్ధమవుతున్నారు. వీటన్నింటికీ తోడు రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లోని తెలుగు సంఘాలు ఐక్యవేదికగా దిశగా కసరత్తు చేయాలనే ఆలోచనలు సాగిస్తున్నాయి. ఇప్పట్నుంచి ప్రాంతాలవారీగా తెలుగువారందర్నీ సమీకరించి భవిష్యత్ ఎన్నికల రాజకీయ గుర్తింపునకు పునాదులు వేయాలని తలంచుతున్నాయి.
ఇటీవల ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు సైతం తెలుగువారి ఐక్యతపై సంఘాలతో చర్చించారు. ఓట్లు అడగడానికి వెళ్లినప్పుడు, ప్రముఖులతో మాట్లాడిన సందర్భాల్లో ఆయా నేతలు ‘సాక్షి’ కథనాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. పశ్చిమ మహారాష్ట్రలోని షోలాపూర్, మరాఠ్వాడాలోని నాందేడ్, విదర్భలోని చంద్రాపూర్‌ల తోపాటు ముంబై, భివండీ నేతలు ప్రత్యేకంగా దృష్టిసారించారు.
ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసినందున.. నేతలు తెలుగువారి ప్రాంతాల్లో పెద్దలను కలిసి అంతర్గత చర్చల్లో నిమగ్నమయ్యారు. బీజేపీ తరఫున కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఆపార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితోపాటు తెలుగు సినీ నటుడు కృష్ణంరాజు ప్రాంతాలవారీగా పర్యటిస్తున్నారు. మరోవైపు సినీనటుడు ప్రకాష్‌రాజ్ సైతం తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు హామీలతోపాటు తాత్కాలిక ప్రయోజనాలకు సైతం తెరదీశారు.
ప్రాధాన్యమిచ్చే నేతకే ఓటు..
ఎన్నికల నేపథ్యంలో నేతల భవితవ్యంపై తెలుగువారి తీర్పు ఏవిధంగా ఉండబోతుందనే విషయంపై సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈనెల 15న జరగనున్న ఎన్నికల్లో మెజార్టీ తెలుగువారి ఓటింగ్ ఏ పార్టీకి చెందిన నేత సొంతం చేసుకుంటాడనేది ఈసారి ప్రశ్నార్థకమేనని చెప్పవచ్చు. స్థానిక సమస్యల పరిష్కారంతోపాటు తమకు అన్నివిషయాల్లోనూ అండగా నిలిచే నాయకుడి కోసం తెలుగు ఓటర్లు వేచిచూస్తోన్న తరుణంలో .. ఈ ఎన్నికల్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ విషయంలో తెలుగుసంఘాలు కీలక భూమిక పోషిస్తుండగా, పలు పార్టీల నేతలూ తెలుగు ఓటింగ్ ప్రభావం ఎటువైపు మొగ్గుచూపుతుందోనని ఉత్కంఠతో ఉన్నారు.
ప్రతీసారి తెలుగువారి చీలిక ఓటింగ్‌తో అధికారాన్ని నెట్టుకొస్తున్న నేతలు .. మారిన పరిస్థితుల్లో ఖంగుతినే ప్రమాదాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకనుగుణంగానే తెలుగు ప్రజలంతా తమకు నచ్చిన నేతను ఎన్నుకోవడంలో ఏకాభిప్రాయ ఓటింగ్‌నకు సిద్ధం కావాలనే ఆలోచనలు చేస్తున్నారు. కులమతాలు, రాజకీయ పార్టీలకతీతంగా అందరూ ఒకే నేతను ఎన్నుకున్నప్పుడే తెలుగోడి సత్తా తెలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.