భార్యపై కోపంతో మానవ మృగంగా..
ఇస్లామాబాద్ : భార్యతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో మానవ మృగంగా మారాడు. అభం శుభం తెలియని ముగ్గురు కూతుళ్లకు ఉరివేసి చంపాడు. ఆపై భార్యపై హత్యాయత్నం చేశాడు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలివీ.. అహ్మద్ యార్(40) అనే వ‍్యక్తికి భార్య షకీలాతోపాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల ఆ దంపతుల మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో భార్య కూతుళ్లను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.
ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న యార్ శనివారం తన ముగ్గురు కుమార్తెలు జైనాబ్(1), జమీరా(7), మరియం(5)లను ఇంట్లోనే ఉరి వేసి చంపాడు. అపైన కత్తి తీసుకుని అత్తవారింటికి వెళ్లి భార్యను చంపేందుకు యత్నించాడు. ఆమె కేకలు వేయటంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి వచ్చి యార్‌ను పట్టుకున్నారు. స్థానికుల సమాచారం అందించటంతో పోలీసులు వచ్చి యార్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.