అసలు ట్రంప్‌కు పవర్ ఎలా? రంగంలోకి ఎఫ్‌బీఐ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యాకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయా? వారి మధ్య ఒప్పందాలు జరిగి ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడ్డారా? అవినీతి నేరాలకు ఒడిగట్టారా అనే విషయాలపై తాము దర్యాప్తు చేస్తున్నామని ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కామే బహిరంగంగా స్పష్టం చేశారు. ‘వారు(రష్యా) మా ప్రజాస్వామ్యాన్ని దెబ్బకొట్టాలని భావించారు. ఆమె(హిల్లరీ క్లింటన్)ను గాయపరిచారు. అతడి(డోనాల్డ్ ట్రంప్)కి సహాయం చేశారు’ అని కామే ఆరోపించారు.
అదే సమయంలో ఎన్నికల సమయంలో అమెరికాకు చెందిన కొంతమంది ప్రత్యేకమైన పౌరుల ఫోన్లను ట్యాపింగ్ చేసే విషయాన్నిమాత్రం ఇప్పుడే చెప్పలేనని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రభావం చూపించారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు కూడా సామాన్యుల నుంచి అగ్రస్థానాల్లో ఉన్న సంస్థల అధిపతులకు కూడా నచ్చలేదు.
ఈ నేపథ్యంలో అమెరికాలో గత ఏడాది(2016)నవంబర్ 8 జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌తో కలిసి రష్యా ఏదైనా కుట్రలకు పాల్పడిందా అనే అంశంపై ఎఫ్‌బీఐ ఇప్పటికీ దర్యాప్తు చేస్తూనే ఉందని ఆయన ఓ ఇంటెలిజెన్స్‌కు స్పష్టం చేశారు. అంతేకాదు, అమెరికాలో ఎవరు అధ్యక్షుడు కావాలనే విషయంలో పుతిన్‌కు ఒక స్పష్టత ఉందని, అతడికి హిల్లరీ అధ్యక్షురాలు కావడం ఇష్టం లేదని, ట్రంప్ అధికారంలోకి రావాలని అతను నిర్ణయించుకున్నారని, ఆ ప్రకారమే ట్రంప్ అధికారంలోకి వచ్చాడని నేరుగా కామెంట్లు చేసి తాజాగా వివాదం రేపారు. దీనిపై అమెరికా అధ్యక్ష భవనం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.