సాక్షి, న్యూఢిల్లీ : మనకు కుక్క పిల్లలంటే ఎంత ముద్దో. ఐరోపా దేశాల ప్రజలకు పిల్లి కూనలంటే అంతకంటే ఎక్కువ ముద్దు. ఇష్టపడి పెంచుకున్న పిల్లిగానీ, పిల్లి కూనగాని మరణిస్తే వారు కూడా మనిషి చనిపోయిన దానికన్నా ఎక్కువే బాధ పడతారు. అలాంటి వారికి అచ్చంగా చనిపోయిన పిల్లికూనలాంటి పిల్లికూననే అందిస్తే వారి ఆనందానికి అంతుండదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. చైనాలోని ఓ బయోటెక్నాలజీ కంపెనీ క్లోనింగ్ ద్వారా ‘బ్రిటిష్ షార్ట్ హేర్ కిటెన్’ను సృష్టించింది. బీజింగ్‌లోని సినోజీన్ బయోటెక్నాలజీ కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటి పిల్లి కూనకు జన్మనిచ్చింది. ఈ పిల్లి కూనకు ‘గార్లిక్’ అని నామకరణం కూడా చేశారు.
హాంగ్ హూ అనే చైనీయుడి ఇష్టపడి పెంచుకున్న పిల్లి కూన మూత్రనాళం ఇన్‌ఫెక్షన్‌తో మరణించిందట. అచ్చం అలాంటి పిల్లి కూనే కావాలంటూ ఆయన సినోజీన్ బయోటిక్ కంపెనీని ఆశ్రయించారు. దాంతో వారు పిల్లి పిండాన్ని లాబరేటరీలో రూపొందించి ఓ అద్దె తల్లి (ఆడ పిల్లి) గర్భంలో ప్రవేశ పెట్టగా అది 66 రోజుల్లో గార్లిక్‌కు జన్మనిచ్చింది. చనిపోయిన పిల్లి, క్లోనింగ్ ద్వారా పుట్టిన పిల్లి కూన చూడడానికి ఒకే లాగా ఉంటాయని, అయితే గుణ, గణాల్లో కచ్చితంగా తేడాలు ఉంటాయని నిపుణలులు తెలిపారు. అన్ని పిల్లుల్లాగానే క్లోనింగ్ పిల్లి కూనకు కూడా అంతే ఆయుర్దాయం ఉంటుందని వారు చెప్పారు.
పిల్లి కూన క్లోనింగ్‌కు దాదాపు 30 వేల పౌండ్లు (26 లక్షల రూపాయలు) ఖర్చు అయ్యాయట. ఇక ఎవరికి పిల్లి కూన క్లోనింగ్ కావాలంటే దాదాపు 26, 27 లక్షల రూపాయలకు చేస్తామని లాబరేటరీ వర్గాలు తెలిపాయి. కుక్క పిల్లల కోసం కూడా క్లోనింగ్ చేస్తామని, వాటికి 38 లక్షల నుంచి 46 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని బయో టెక్నాలజీ కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment