డబ్లిన్ : గర్భస్రావంపై నిషేధం ఎత్తివేయాలంటూ ఐరిష్ మహిళలు చేస్తున్న పోరాటంపై విప్లవాత్మక తీర్పు వచ్చింది. అబార్షన్లపై నిషేధాన్ని ఎత్తేయాలా? వద్దా? అన్న అంశంపై చేపట్టిన రిఫరెండంలో, 66 శాతం మంది ఈ నిషేధాన్ని ఎత్తివేయాలనే ఓటు వేశారు. శనివారం రోజు దీని తొలి ఫలితాన్ని అధికారికంగా ప్రకటించారు. 40 నియోజకవర్గాల్లో తొలి నాలుగింటిన్ని వెల్లడించారు. దీనిలో 66.36 శాతం మంది నిషేధం ఎత్తివేయాలని ఓటు వేయగా.. 33.64 శాతం మంది మాత్రం నిషేధ ఎత్తివేతకు వ్యతిరేకంగా ఓటు వేసినట్టు డుబ్లిన్‌లోని సెంట్రల్ కౌంట్ సెంటర్ వెల్లడించింది. డుబ్లిన్ సెంట్రల్‌లో 77 శాతం మంది, కార్క్ సౌత్-సెంట్రల్‌లో 69 శాతం మంది, కార్క్ నార్త్ సెంట్రల్‌లో 64 శాతం మంది, గాల్వే ఈస్ట్‌లో 60 శాతం మంది అబార్షన్ల నిషేధ ఎత్తివేతకు ‘యస్’ అని ఓటు వేసినట్టు తెలిసింది.
దీంతో ఎంతో కట్టుదిట్టంగా అమలవుతున్న అబార్షన్ వ్యతిరేక చట్టానికి ఇక చరమగీతం పాడాల్సివసరం వస్తోంది. ఈ ఏడాది చివరి వరకు అబార్షన్లకు అనుమతి ఇచ్చే ఓ కొత్త చట్టం తీసుకొస్తామని ప్రధాని లియో వరడ్కర్ చెప్పారు. కొత్త చట్టం డ్రాఫ్టింగ్ కోసం మంగళవారం కేబినెట్ సమావేశమవుతుందని తెలిపారు. తల్లి ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశమున్నప్పుడు అబార్షన్‌కు అనుమతించేలా ఈ కొత్త చట్టం రూపుదిద్దుకోనుంది. అబార్షన్ నిషేధం అనే కఠినతర చట్టం వల్ల ఆరేళ్ల క్రితం సవిత అనే ఓ భారతీయ మహిళ మృతి ఎందరినో కలచివేసింది. దీంతో ఐర్లాండ్ ప్రభుత్వం ఈ రిఫరెండాన్ని చేపట్టింది. సవిత మరణంతో అబార్షన్ల విషయంలో ఐర్లాండ్ వాసుల దృక్కోణంలో మార్పు వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. నేడు వెల్లడైన తొలి ఫలితం కూడా ఇదే విషయాన్ని ఉద్ఘాటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment