శృంగారంతో ఎబోలా.. నిర్ధారణ అయిందిలా..
న్యూయార్క్: గతంలో ఎబోలా బారినపడి, ఆ తరువాత కోలుకున్న వ్యక్తితో శృంగారంలో పాల్గొనడం ద్వారానూ ఆ వ్యాధి వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. యూఎస్ ఆర్మీ సైంటిస్టులు, లైబీరియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ రీసెర్చ్ (ఎల్ఐ బీ ఆర్)లు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం తేలింది. పరిశోధన ఎలా సాగిందంటే..
ఈ ఏడాది మార్చి ప్రారంభంలో ఒక 'ఎబోలా పాజిటివ్' మహిళ రక్త నమూనాలను శాస్త్రవేత్తలు సేకరించారు. సదరు రోగి.. వ్యాధి బారిన పడటానికి కొద్ది రోజుల ముందు ఓ వ్యక్తితో శ్రృంగారంలో పాల్గొంది. నిజానికి ఆ పురుషుడు కూడా గతంలో ఎబోలా వ్యాధిగ్రస్తుడే. అయితే పూర్తి స్థాయి చికిత్స తీసుకోవడంతో అతనికి జబ్బు నయమైంది. 2014, అక్టోబర్ లో నిర్వహించిన పరీక్షల్లోనూ ఆ పురుషుడిలో ఎబో వైరస్ లేదని వెల్లడయింది. ఈలోపే అంటే మార్చి 27న మహిళా రోగి మరణించింది.
ఆ తరువాత ఈ కేసును మరింత లోతుగా అధ్యయనం చేయాలనుకున్న శాస్త్రవేత్తలు.. సదరు పురుషుడి వీర్యాన్ని సేకరించి పరీక్షలు నిర్వహించగా.. దానిలో ఎబోలా వైరస్ సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. 'అంటే 'ఎబో నెగటివ్' వ్యక్తిగా నిర్ధారణ అయినప్పటికీ ఆ వ్యక్తి వీర్యకణాల్లో వైరస్ పూర్తిగా చావదు. అందువల్లే వీర్యకణాల ద్వారా మహిళ రక్తకణాల్లోకి ఎబోలా నేరుగా వ్యాపించింది' అని జేసన్ లాండర్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు.
ఈ పరిశోధన ద్వారా వీర్యకణాల్లో దాగుండే ఎబోలా వైరస్ ఎంతకాలంపాటు సజీవంగా ఉండగలుగుతుందో తెలుసుకోవడమేకాక ఎబోలా నివారణకు తీసుకోవాల్సిన రక్షణాత్మక చర్యలపై ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉన్నట్లు యూఎస్ ఆర్మీ మెడికల్ శాస్త్రవేత్త గుస్తావో పలాసియో చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం
ఆఫ్రికాలోని గునియా, లైబీరియా, సియర్రా లియోన్ దేశాలను తీవ్రంగా, ప్రపంచమంతటినీ పాక్షికంగా కలచివేసిన ఎబోలా వ్యాధితో ఇప్పటివరకు 11 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, మరో 28వేల పాజిటివ్ కేసును గుర్తించారు.