
వరదల్లో 55 మంది మృతి
కొలంబో: శ్రీలంకలో భారీ వర్షాలు, వరదల కారణంగా 55 మంది ప్రాణాలు కోల్పోగా 40 మంది జాడ తెలియకుండా పోయారు. సబరగమువతోపాటు పశ్చిమ, దక్షిణ ప్రావిన్సుల్లో గురువారం నుంచి కురుస్తున్న వర్షాలకు 2,811 కుటుంబాలు సర్వస్వం కోల్పోయారని ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. ఒక్క కలుతర జిల్లాలోనే 38 మంది, రత్నపుర జిల్లాలో 10 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.
గాలే జిల్లాలో అత్యధికంగా ఏడు వేల మందికిపై నిరాశ్రయులయ్యారని వివరించింది. వరద ఉధృతి పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వచ్చే 24 గంటల్లో కేగల్లె, గాలే, కలుతర, మాతర, హంబన్‌తోట ప్రాంతాల్లో కొండచెరియలు విరిగి పడే ప్రమాదముందని తెలిపింది. ఈ దృష్ట్యా అధికారులను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది.