
19 రోజుల్లో 57 అంతస్తులు..!
చైనా: ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అన్నారు. ఈ రెండూ అంత కష్టమైన పనులని ఈ సామెత ఉద్దేశం. కానీ చైనాకు చెందిన ‘బ్రాడ్ సస్టెయిన్‌బుల్ బిల్డింగ్-బీఎస్‌బీ’ అనే నిర్మాణ కంపెనీ సాధించిన ఘనత చూసిన తర్వాత ఈ సామెతను మార్చాల్సిందేనేమో!! ఈ కంపెనీ కేవలం 19 రోజుల్లో 57 అంతస్తుల ఆకాశహర్మ్యాన్ని నిర్మించి ఔరా అనిపించింది. అంటే.. రోజుకు మూడు అంతస్తులు కట్టేసిందన్నమాట. చైనాలోని చంగ్షా నగరంలో ‘స్కై సిటీ’ పేరుతో ఈ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఇందులో కార్యాలయాలకు ప్రదేశంతోపాటు 800 ఫ్లాట్లు ఉన్నాయి. మొత్తమ్మీద నాలుగు వేల మంది ఇందులో ఉండొచ్చు. ఈ నిర్మాణానికి సంబంధించి నాలుగు నిమిషాల నిడివిగల ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.