శునకం కోసం సాహసం
హాంకాంగ్‌కు చెందిన ఓ ధీరవనిత తన పెంపుడు కుక్కను రక్షించుకునేందుకు 16 అడుగుల కొండచిలువతో ప్రాణాలకు తెగించి పోరాడింది. సాయికుంగ్‌లో నివసించే కర్టెనీ లింక్ దంపతులకు డెక్ట్స ర్ అనే పెంపుడు కుక్క ఉంది. గత శనివారం లింక్ దంపతులు సమీపంలోని వెస్ట్‌కంట్రీ పార్కుకు వాకింగ్ చేయడానికి వెళ్లారు. తోడుగా డెక్ట్సర్‌ను కూడా వెంటతీసుకెళ్లారు. ఇంతలో 16 అడుగుల బర్మీస్ జాతికి చెందిన కొండచిలువ డెక్ట్సర్‌ను నోట్లో పెట్టుకుంది. ప్రాణంలా చూసుకుంటున్న తన పెం పుడు కుక్కను రక్షించేందు కు లింక్ వెంటనే వట్టి చేతి తో కొండచిలువపై దాడికి దిగింది.
కానీ, కుక్కను రక్షించడం తనవల్ల కాలే దు. వెంటనే ఆమె భర్త పిటీ తన జేబులోంచి చిన్నపాటి కత్తిని లింక్‌కు అందించాడు. ఆలోపే డెక్ట్సర్‌ను సగం వరకు కొండచిలువ మింగేసింది. వెంటనే తేరుకున్న లింక్ కొండచిలువపై ఆ చిన్నకత్తితోనే పోరాటం మొదలెట్టింది. దాని మెడపై కత్తితో దాడిచేయడంతో చివరకు కొండచిలువ డెక్ట్సర్‌ను వదిలేసింది. చివరకు చిన్నపాటి గాయాలతో ఆ పెంపుడు కుక్క ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై లింక్ స్పందిస్తూ... ‘జంతు ప్రేమికురాలిగా పాముపై దాడిచేయడం నిజంగా బాధనిపించింది. కానీ, నా పెంపుడు కుక్కను రక్షించడానికి ఆ పనిచేశా’నని పేర్కొంది. బర్మీస్ జాతికి చెందిన కొండచిలువలు హాంకాంగ్‌లో అతిపెద్ద పాముల్లో ఒకటి. ఇవి సుమారు 20 అడుగుల వరకు పెరుగుతాయి.