
న్యూఢిల్లీ: భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రెండు రోజులపాటు చైనాలో పర్యటించనున్నారు. గత వారం భారత్ జమ్ము కశ్మీర్‌ను రెండుగా విడదీసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చర్యపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ విషయంపై మద్దతు కూడగట్టేందుకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేశీ ఆ దేశంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో జైశంకర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేగాక, విదేశాంగ మంత్రిగా జైశంకర్ తొలి చైనా పర్యటన ఇది. ఆదివారం చైనా బయల్దేరిన జైశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యితో భేటీ అవుతారు. కశ్మీర్ విభజన, ద్వైపాక్షిక వాణిజ్యం, అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం పర్యవసానాలు వంటి విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భారత్ పర్యటనను కూడా ఈ పర్యటనలో ఖరారు చేసే అవకాశం ఉంది. అనంతరం సోమవారం సాయంత్రం రెండు దేశాల విదేశాంగ మంత్రులు మీడియా సమావేశంలో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment