అబోటాబాద్ లోని ఇంట్లో టీవీ చూస్తున్న ఒసామా బిన్ లాడెన్ (2011 మే 7న అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ఈ ఫొటోను విడుదలచేసింది)
వాషింగ్టన్: అడ్డు తగిలేవారిని, అవసరం తీరిందనుకున్నవాళ్లని సైలెంట్ గా ఫినిష్ చేస్తాయి గూఢచార సంస్థలు! అలాంటి కుట్రల్లో ఆరితేరిన పాక్ ఐఎస్ఐ.. ఓ సీఐఏ అధికారిపైనా విషప్రయోగం జరిపినట్లు తెలిసింది. బిన్ లాడెన్‌ను తమ దేశంలోనే దాచిపెట్టి, పైకి అతణ్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు నటించిన పాకిస్థాన్.. లాడెన్ జాడ కనిపెట్టడంలో కీలకంగా వ్యవహరించిన సీఐఏ అధికారిపై విష ప్రయోగం జరిపినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. సీఐఏ చీఫ్‌గా పాకిస్థాన్‌లో పనిచేసిన మార్క్ కెల్టన్ పై ఐఎస్ఐ విషప్రయోగం చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది.
2011 మే 4న అమెరికా సీల్ దళాలు అబోతాబాద్ లోని ఇంటిపై దాడిచేసి అల్ కాయిదా చీఫ్ బిన్ లాడెన్ ను అంతం చేసిన రెండు నెలల తర్వాత సీఐఏ చీఫ్ మార్క్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను పాకిస్థాన్ నుంచి వెనక్కి పిలిపించారు. అమెరికా వెళ్లిన తర్వాత మార్క్ అనారోగ్యం తీవ్రం కావడంతో దాదాపు మరణం అంచుల దాకా వెళ్లొచ్చారు. ఆయన బాధకు కారణం ఏమిటనేది డాక్టర్లు వెంటనే కనిపెట్టలేకపోయారు. చివరికి పొత్తికడుపు ప్రాంతంలో ఆపరేషన్ చేసి మార్క్ ను బతికించిన డాక్టర్లు.. ఆయనపై విషప్రయోగం జరిగి ఉండొచ్చని నిర్ధారించారు.
ఇదే విషయాన్ని మార్క్ కూడా అంగీకరిస్తూ.. గూఢచార సంస్థల్లో పనిచేసే వాళ్లపై ఇలాంటి భయంకరమైన ప్రయోగాలు కొత్తేమీ కాదని, ప్రపంచానికి శత్రువు లాంటి లాడెన్ ను చంపడంలో కీలక వ్యక్తినయినందుకు గర్వంగా ఉందని అన్నారు. అయితే విషప్రయోగంపై తగిన ఆధారాలు లభించే అవకాశం లేనందున మార్క్ విషయంలో పాకిస్థాన్ ను బహిరంగంగా నిందించలేమని సీఐఏ అధికార ప్రతినిధి డీన్ బోయ్డ్ అన్నారు. ఐఎస్ఐ గతంలోనూ ఎంతో మంది జర్నలిస్టులు, దౌత్యవేత్తలపై విషప్రయోగాలు జరిపిందని, తనకు ఇష్టం లేని విధంగా కెల్టన్.. లాడెన్ గుట్టురట్టు చేసినందుకు ఐఎస్ఐ ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండొచ్చని ఇంకొందరు సీఐఏ అధికారులు పేర్కొన్నారు.