బుష్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్(సీనియర్) (92) అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో గల ఓ ఆస్పత్రిలో బుధవారం ఉదయం ఆయనను చేర్పించినట్లు అక్కడి కేహెచ్‌ఓయూ అనే టెలివిజన్ సంస్థ తెలిపింది. కొద్ది రోజుల తర్వాత ఆయనను ఆస్పత్రి వర్గాలు ఇంటికి పంపించే అవకాశం ఉందని జీన్ బెకర్ అనే వ్యక్తి తెలిపారు.
అయితే, ఆయనను ఏ ఆస్పత్రిలో చేర్పించారనే విషయం మాత్రం బయటకు తెలియనివ్వలేదు. అలాగే, ఆయన ఆస్పత్రిలో అనూహ్యంగా చేరడానికి గల కారనాలు కూడా చెప్పలేదు. గతంలో ఓ సారి ఆయన కిందపడి ఆయన మెడలోని ఎముక విరిగిపోవడంతో తనకుమారుడు జార్జ్ బుష్ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుర్చీకే పరిమితం అయిన సీనియర్ బుష్ ఇప్పటికే తన మెడకు పట్టీని కొనసాగిస్తున్నారు.