
190 ఆలయాలు నేలమట్టం
మయన్మార్ దేశాన్ని కుదిపేసిన భూకంపం తాకిడికి నలుగురు మరణించగా.. 190 బౌద్ధ ఆలయాలు నేలమట్టం అయ్యాయి. అత్యంత పురాతనమైన ఈ పగోడాలు చాలావరకు కుప్పకూలిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి. మాగ్వే ప్రాంతంలోని పక్కోకు టౌన్‌షిప్‌లో పొగాకు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ కూలిపోవడంతో ఓ పురుషుడు, మహిళ మరణించారు. యెనాన్‌చౌంగ్ టౌన్‌షిప్‌లో 7, 15 సంవత్సరాల వయసున్న ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. భూకంప ప్రభావం పొరుగునున్న భారతదేశంలోని పశ్చిమబెంగాల్‌తో పాటు బంగ్లాదేశ్ మీద కూడా కనిపించింది. భూకంప కేంద్రం మయన్మార్‌కు దక్షిణంగా 190 కిలోమీటర్ల దూరంలోని మండలే నగరం దగ్గరలో ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది భూమికి 90 కిలోమీటర్ల లోతులో ఉంది. మయన్మార్‌లో గడిచిన రెండు రోజుల్లో భూకంపాలు రెండుసార్లు వచ్చాయి.
భారత్- మయన్మార్ సరిహద్దులతో పాటు అసోం, త్రిపుర, మిజొరాం, మేఘాలయ లాంటి ప్రాంతాల్లో మంగళవారం నాడు 5.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే దీని ప్రభావం మరీ ఎక్కువగా కనిపించలేదు. 2016 జనవరి నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 26 సార్లు భూమి కంపించింది.