అమ్మో.. రాక్షస పిరానాలు కనిపించాయి
సియోల్: పిరానా చిత్రాన్ని మీరు చూసే ఉంటారుగా. అందులో ఉండే పిరానా చేపలు ఎంతటి బీభత్సం సృష్టిస్తాయి కదా.. ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచేంత క్రూరంగా అవి ప్రవర్తిస్తాయి. స్వయంగా మాంసాహారులైన ఫిరానాలు ఒక చెరువులో చేరాయంటే మొత్తం చేపలన్నీ మాయమవ్వాల్సిందే. ఎందుకంటే ఇవి వాటిని అమాంతం తినేసి చెరువును డొల్ల చేస్తాయి. ఎవరైనా అందులోకి దిగారంటే కుక్కలకంటే హీనంగా పీక్కు తింటాయి. అరుదైన జలాల్లోనే ఇవి నివాసం ఉంటాయి. అలాంటి ఈ రాక్షస చేపలు నాలుగింటిని దక్షిణ కొరియాలోని ప్రభుత్వాధికారులు గుర్తించారు.
ఇవి మంచి నీళ్లల్లో ఉండటమనేది అత్యంత అరుదైన విషయంకాగా.. హోంగ్సియాంగ్ రాష్ట్రంలోని ఓ పర్వత పాదం వద్ద ఉన్న పదివేల స్క్వేర్ మీటర్లు విశాలమైన మంచినీటి రిజర్వాయర్ లో ఇవి కనిపించడంతో అక్కడి వారు ఆందోళన చెందడం ప్రారంభించారు. తొలుత ఓ స్థానికుడు ఈ చేపను గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకాలజీ ప్రత్యేక గాలింపు చర్యలు ప్రారంభించి తొలుత 19 సెంటీ మీటర్ల ఫిరానాను గుర్తించారు. ఆతర్వాత మరో రోజు 15 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్ల ఫిరానాలను గుర్తించారు. ఫిరానా చేపలు అత్యంత ప్రమాదకరమైనవి.