
చిచ్చరపిడుగుకు యూట్యూబ్ కిరీటం
వాషింగ్టన్: 'మినీ బియాన్స్'గా పేరొందిన నాలుగేళ్ల చిచ్చరపిడుగు ఈ ఏడాది యూట్యూబ్ కిరీటాన్ని ఎగరేసుకుపోయింది. అదరిపోయే తన స్టెప్పులతో ఈ చిన్నారి పెట్టిన డ్యాన్స్ వీడియో 2015 సంవత్సరంలో అత్యధిక వ్యూస్ సాధించింది. ర్యాపర్ సైలెంటో పాడిన 'వాచ్ మి' పాటకు న్యూయార్క్ వీధుల్లో ఈ బుజ్జాయి వేసిన స్టెప్పులకు వీక్షకుల నుంచి అదరహో అనే రెస్పాన్స్ వచ్చింది. 'హేవన్ కింగ్'గా పేరొందిన ఈ చిన్నారి డ్యాన్స్ వీడియోను ఇప్పటివరకు 116 మిలియన్ల (16.6 కోట్ల) మంది చూశారని, ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన వీడియో ఇదేనని గూగుల్ నేతృత్వంలోని యూట్యూబ్ ప్రకటించింది.
ఇక రెండోస్థానంలో నటుడు లియాన్ నీసన్ నటించిన 'క్లాష్ ఆఫ్ క్లాన్స్' వీడియో గేమ్ నిలిచింది. దీనిని 83 మిలియన్ల (8.3 కోట్ల) మంది చూశారు. 'హేవన్ కింగ్' చిన్నారి వీడియో పోల్చుకుంటే రెండోస్థానంలో ఉన్న వీడియోకు సగం వ్యూస్ కూడా రాకపోవడం గమనార్హం. యూట్యూబ్ ప్రముఖుడిగా పేరొందిన ప్రంక్‌స్టర్ రోమన్ అట్వూడ్ తీసిన 'క్రేజీ ప్లాస్టిక్ బాల్' వీడియో మూడోస్థానంలో నిలించింది. దీనిని 56 మిలియన్ల (5.6 కోట్ల) మంది వీక్షించారు. యాడ్ కౌన్సిల్ జారీచేసిన 'లవ్ హజ్ నో లేబుల్', జస్టిన్ బీబర్ వీడియో, డెలవేర్ పోలీసులు పెట్టిన 'కన్ఫెషనల్' వీడియో టాప్ వీడియోల్లో చోటుసంపాదించాయి. పదో పుట్టినరోజు జరుపుకుంటున్న యూట్యూబ్‌కు 2015 ఎంతో అద్భుతమైన సంవత్సరమని, యూట్యూబ్ అభిమానులు ఈ ఏడాది ఎన్నో వినూత్నమైన డ్యాన్సులు ప్రవేశపెట్టారని, జీవవైవిధ్యం, సమ్మిళిత అభివృద్ధి, ఆధునిక కార్లు వంటి ఎన్నో అంశాలపై యూట్యూబ్ వేదికగా చర్చించారని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.